అటవీశాఖలో అవినీతి అనకొండలు

  • అడవిని రక్షించాల్సినవారే అమ్ముకుంటున్నారు
  • కాంట్రాక్టర్లు, పోడు రైతుల నుంచి విచ్చలవిడిగా లంచాలు
  • తరచూ ఏసీబీకి చిక్కుతున్న అటవీశాఖ అధికారులు
  • అటవీశాఖ అధికారులకు కలిసిరాని రూ.3.5లక్షలు లంచం
  • కొత్తగూడెం PCB అధికారుల అవినీతిపై కూడా ACB దృష్టి పెట్టాలని కోరుతున్న పలువురు పర్యావరణ వేత్తలు..
  • త్వరలో పూర్తి ఆధారాలతో కొత్తగూడెం PCB అధికారుల అవినీతిపై ACB కి ఫిర్యాదు చేయనున్న పలువురు పర్యావరణ వేత్తలు, బాధితులు..

అడవిని రక్షించాల్సిన కొందరు అటవీశాఖ అధికారులు అడవిని అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడిక్కక్కడ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి లంచాలు తీసుకుంటూ సొంత ఖాతాలలో జమచేసుకుంటున్నారు. కోట్ల కోట్లు కూడబెడుతున్నారు. ఏజెన్సీలో పోడు పట్టాలు ఉన్నా.. లేకపోయినా… ఆ భూములలో వ్యవసాయం చేయాలంటే, ప్రతి ఏడాది అటవీ అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. భద్రాచలం డివిజన్ కు చెందిన ఎఫ్ఎఓ సుజాత, డీఆర్ఓ కృష్ణయ్యలు.. ఓ కాంట్రాక్టర్ ను రూ. 3.50 లక్షలు లంచం డిమాండ్ చేయగా గురువారం ఏసీబీ అధికారులు వారిని ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదే శాఖలో మూడు కేసులు నమోదయ్యాయంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అటవీ శాఖలో కంచె చేను మేసిన చందంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. అడవిని రక్షించాల్సిన అధికారులు అడవిని అమ్ముకుం టూ లక్షలు గడిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆయా ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో రహదారులను నిర్మిస్తున్నారు. రహదారులు నిర్మించే సమయంలో అటవీ సంపదకు నష్టం వాటిల్లుతుంది. ఈ నష్టపరిహారాన్ని సంబంధిత కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి అటవీ శాఖకు జమచేయాల్సి ఉంటుంది. కాని కొందరు అధికారులు కాంట్రాక్టర్లతో కలిసిపోయి లంచాల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేసి తమ సొంత ఖాతాలలో జమచేసుకుంటున్నారు. అలాగే పోడు వ్యవసాయం ఫారెస్ట్ అధికారుల పట్ల వరంగా మారింది. ఏజెన్సీలో పోడు పట్టాలు ఉన్నా… లేకపోయినా… ఆ భూములలో వ్యవసాయం చేయాలంటే, ప్రతి సంవత్సరం అటవీ అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఇటువంటి పరిస్థితిలో అటవీ ప్రాంతాల గుండా రహదారులు నిర్మించే కాంట్రాక్టర్స్ నుంచి ఫారెస్ట్ అధికారులు లక్షలు డిమాండ్ చేస్తూ వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఇదే శాఖలో మూడు కేసులు నమోదయ్యాయి అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కొత్తగూడెం అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన అధికారి రూ.3.5లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గురువారం భద్రాచలం డివిజన్ కు చెందిన మరో ఇద్దరు అటవీశాఖ అధికారులను ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

అటవీశాఖ అధికారులకు కలిసిరాని రూ.3.5లక్షలు లంచం
గతంలో ఒక ఫారెస్ట్ అధికారి రూ.3.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడగా.. గురువారం కూడా ఇద్దరు ఫారెస్ట్ అధికారులు రూ.3.5లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడటం విశేషం. ఏసీబీ డీఎస్పీ రమేష్ వెల్లడించిన వివరాలు ప్రకారం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా చర్ల మండలం పూసుగుప్ప గ్రామం నుంచి ఛత్తీస్ ఘడ్ కు రెండు కిలోమీటర్ల బీటీ రోడ్ నిర్మిస్తున్నారు. ఈ రోడ్ నిర్మాణంతో కొంతమేర అటవీ సంపదకు నష్టం వాటిల్లింది. దీంతో భద్రాచలం ఎఫ్ఎఓ సుజాత, డీఆర్ఓ కృష్ణయ్య రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుని రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, చివరకు రూ.3.5లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల వేధింపులకు విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులకు పిర్యాదు చేయడంతో, గురువారం సదరు కాంట్రాక్టర్ చేతికి ఏసీబీ అధికారులు రూ.3.5లక్షలు ఇచ్చి, ఫారెస్ట్ అధికారులకు ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టర్ వద్ద నుంచి ఎఫ్ఎఓ సుజాత, డీఆర్ఓ కృష్ణయ్య లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి రమేష్ తెలిపారు. అవినీతికి పాల్పడిన అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరపనున్నట్లు రమేష్ పేర్కొన్నారు.

ఇది ఇలా ఉండగా కొత్తగూడెం PCB అధికారుల విచ్చలవిడి అవినీతిపై కూడా ACB అధికారులు దృష్టి పెట్టాలని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. పర్యావరణం పూర్తిగా పాడవుతున్న పట్టించుకోకుండా లంచాలు తీసుకోవడమే విధిగా పెట్టుకున్న కొత్తగూడెం PCB అధికారుల విచ్చలవిడి అవినీతిపై వారి ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదనపై త్వరలో పూర్తి ఆధారాలతో ACB అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పలువురు పర్యావరణ వేత్తలు, బాధితులు తెలిపారు.