కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి (HMWSSB) జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు

  • రూ. 1.20 కోట్ల రూపాయల నగదు, కేజీ బంగారం
  • నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు

హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి.. హైదరాబాద్‌తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లాపూర్‌లోని కుమార్ ఇంట్లో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. జీఎం కుమార్ బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుప్పలుగా ఉన్న నోట్ల కట్టలు చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో.. ఆ నగదు లెక్కింపునకు కౌంటింగ్ మెషీన్లను అధికారులు వినియోగిస్తున్నారు. దాదాపు రూ.1.20 కోట్ల నగదు, కిలో బంగారం, కిలో వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారుల బృందం ఆరా తీస్తోంది. గత నెలలో తన కుమార్తె వివాహాన్ని కుమార్ అంగరంగ వైభవంగా ఎంతో డబ్బులు వెచ్చించి మరీ జరిపించాడు. వివాహం కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులు ఎలా సంపాదించారనే దానిపై కుమార్ వద్ద నుంచి ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి, హైదరాబాద్‌లో 9 ఫ్లాట్లు, రూ. 100 కోట్లు వరకు ఆస్తులున్నాయని గుర్తింపు, ఇంకా కొనసాగుతున్న సోదాలు.