ఆదాయానికి మించి ఆస్తులపై కేసు.. వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆస్తులు సీజ్‌

అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్‌ ఆర్‌వో కార్యాలయం సబ్‌ రిజిస్ట్రార్‌-2 దావులూరి ఆనంద్‌ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. అవినీతి నిరోధక శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం ఖమ్మంలోని ఆనంద్‌, ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు చేశారు. రూ.కోటీ 94 లక్షల 1765 విలువైన ఆక్రమ ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారు. అక్రమ ఆస్తుల్లో రూ.71 లక్షల 56 వేల 708 విలువ చేసే రెండు ఖరీదైన ఇండ్లు, రూ.28 లక్షల 37 వేల విలువ చేసే ఆరు ఓపెన్‌ ప్లాట్లు, రూ.24 లక్షల 50 వేల 450 నగదు, రూ.7 లక్షల 5 వేల 367 బ్యాంకు బ్యాలెన్స్‌, రూ.13 లక్షల 25 వేల విలువైన కారు, రెండు బైక్‌లు, రూ.43 లక్షల 16 వేల 930 విలువైన 819 గ్రాముల బంగారు ఆభరణాలు, 2,264 గ్రాముల వెండి ఆభరణాలు సీజ్‌ చేసినట్టు ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య తెలిపారు