కాలుష్య కారక పరిశ్రమలు గ్రీన్‌ బెల్ట్‌ నిబంధనలు పాటించాల్సిందే: డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌

  • శబ్ద కాలుష్య నియంత్రణలో ఎవరికీ మినహాయింపుల్లేవు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ

దేశ, రాష్ట్రాల పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. బుధవారం మంగళగిరిలోని క్యాంప్‌ ఆఫీసులో కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొన్ని పరిశ్రమలు కేవలం లాభాల కోసం నిబంధనలను పక్కనపెట్టి జనావాసాల మధ్య కాలుష్యాన్ని వెదజల్లడం సరికాదన్నారు. పరిశ్రమలు గ్రీన్‌ బెల్ట్‌ ఏర్పా టు చేసుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనింగ్‌ పేరుతో పేలుళ్లు చేయడం వల్ల నివాస గృహాలు బీటలుబారి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పర్యావరణ ప్రమాణాలను అన్ని మైనింగ్‌ సంస్థలూ కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. ‘‘కాలుష్య తనిఖీలు మొక్కుబడిగా మారకూడదు. క్షేత్రస్థాయి తనిఖీలకు వెళ్లినప్పుడు బాధితులను కూడా కమిటీలో భాగస్వాములను చేయాలి. శబ్ద కాలుష్య నియంత్రణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. మతపరమైన, సాంస్కృతికపరమైన కార్యక్రమాల పేరుతో ఇతరుల ప్రశాంతతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు. శబ్ద కాలుష్య నియంత్రణ విషయంలో పరిశ్రమలు, సంస్థలు, ప్రార్థనా మందిరాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు’’ అని స్పష్టం చేశారు. ‘వైట్‌ కేటగిరి పరిశ్రమలు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయని తెలిపా రు. ‘‘బయటకు అస్సలు కాలుష్యం వెదజల్లని పరిశ్రమలుగా చెప్పుకొంటూ.. ఆర్గానిక్‌ వేస్ట్‌, రసాయన వ్యర్ధాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.’’ అని పవన్‌ తెలిపారు. గోస్తనీ నది కాలుష్యం బారిన పడిందని, వేండ్ర గ్రామంలో సేకరించిన నీటి నమూనాల్లో బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ 15ఎంఎల్‌/1కి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతీ పంచాయతీలో ఉన్న ఫిల్టర్‌బెడ్లను నెలరోజుల్లో శుభ్రం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యా ణ్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో జల్‌జీవన్‌ మిషన్‌ పనుల పురోగతిపై సమీక్షించా రు. ఫ్లోరైడ్‌ ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని మాత్రమే కాకుండా, గృహ అవసరాలకు సరఫరా చేసే నీటిని పూర్తి శుద్ధి చేసి సరఫరా చేయాలని సూచించారు. విద్యార్థుల వసతి గృహాల్లో తాగునీటి నాణ్యతకు ఎఫ్‌టీకే కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు.