ప్లాస్టిక్ రహితమైదానాలుగా తీర్చిదిద్దాలి: స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి

  • ఘనంగా యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమం

హైదరాబాద్ : రాష్ట్రంలో అన్ని క్రీడా మైదానాలను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు” కార్యక్రమాల్లో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా “ సర్వ్ అండ్ సపోర్ట్- *యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో యువజన మరియు క్రీడాశాఖ ఆధ్వర్యంలో అన్ని స్టేడియాల్లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి ప్రధాన ఉత్సవాలు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడగా, యువత, క్రీడాకారులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జంట నగరాల్లోని జీఎంసీబీ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, సైక్లింగ్ వెలోడ్రోమ్ స్టేడియంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి డాక్టర్ సోనీ బాలాదేవిలు హాజరైనారు.

ఈ సందర్భంగా చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు వారి తల్లిదండ్రులు కోచులు సిబ్బంది మైదానాలను ప్లే ఫీల్డ్ లను పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్ని స్టేడియాలను ప్లాస్టిక్ రహిత మైదానాలుగా తీర్చిదిద్దాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా యువజన క్రీడ వారోత్సవాలు నిర్వహిస్తూ, ప్రజల అభిప్రాయాన్ని క్రోడీకరించి క్రీడలు మరియు యువజన అభివృద్ధికి ప్రణాళిక బద్ధమైన కృషి చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవి, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యువతతో పాటు క్రీడాకారులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని వివిధ వర్గాల ప్రజల నుండి ఈ కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు, అన్ని వయస్సుల వారు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకునేలా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు. క్రీడాకారులుమైదానాలను తమ ప్లే ఫీల్డ్ లను పరిశుభ్రంగా ఉంచుకోవడం క్రమశిక్షణతో పాటు అంకితభావాన్ని నేర్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనిత డిప్యూటీ డైరెక్టర్లు రవితేజ, సుజాత, శ్రీనివాస్, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవికుమార్, , పీఆర్‌వో కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు.