తెలంగాణ మీడియా అకాడమీలో 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం

తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని మీడియా అకాడమి చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రజల సుదీర్ఘ ఉద్యమానికి ఫలితమని పేర్కొన్నారు. సాధించుకున్న తెలంగాణలో స్వేచ్ఛ, ఆత్మాభిమానం ముఖ్యం అన్నారు. మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్పదనం అన్నారు. అదే విధంగా పేద ప్రజలకు రేషన్ షాప్ ల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నారని ప్రజా ప్రభుత్వం సేవలను ఆయన కొనియాడారు. అదే విధంగా మహిళా సాధికారిత కోసం మహిళలచే సూపర్ బజార్లు, పెట్రోల్ బంక్ ల నిర్వహణ, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుని మహిళాభివృద్దికి ప్రభుత్వం తొడ్పాటు అందిస్తుందన్నారు. గ్రామీణ, పట్టాణాలలో పని చేస్తున్న కార్మికులకు సమాన వేతనాలను అందేలా చట్టం చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో మహానుభావుల త్యాగం ఉన్నదన్నారు. ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు సబ్బండవర్ణాల ప్రజలు పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. అదే విధమైన స్పూర్తితో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముందుగా జనగణమన గీతాలాపన, అనంతరం తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, సిబ్బంది శ్రీలతాదేవి, ప్రసాద్, నరేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.