పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

సనత్ నగర్ లోని టీజీపీసీబీ ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, “పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలి. మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల అవసరం ఎంతగానో ఉంది. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయి” అని అన్నారు. “చికిత్స కన్నా నివారణే మేలు” అని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖల ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యం వల్ల ఎదురవుతున్న సవాళ్లు, పటిష్టమైన పర్యావరణ పాలన, ప్రజా భాగస్వామ్యం, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల ఆవశ్యకతపై సుదీర్ఘంగా మాట్లాడారు. 2047 నాటికి తెలంగాణ ప్రభుత్వం 250 కోట్ల మొక్కలు నాటి, పచ్చదనాన్ని 33 శాతం పెంచనుంది. పట్టణ ప్రాంతాల్లో కాంక్రీట్ అడవులు పెరగడం వల్ల ఉష్ణోగ్రతలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. “భూమి ఒక్కటే, మనం దానిని రక్షించుకోవాలి” అని ప్రధాన కార్యదర్శి అన్నారు. గత ఏడాది కాలంలో పీసీబీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 629 పరిశ్రమలపై టీజీపీసీబీ చర్యలు చేపట్టాము అని టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి తెలిపారు. మనం ప్రతి సంవత్సరం దాదాపు 1.5°C ఉష్ణోగ్రతను దాటుతున్నామని, గ్లోబల్ వార్మింగ్ను 1.5°C కంటే తక్కువగా ఉంచాలంటే, 2030 నాటికి వార్షిక గ్రీన్ హౌస్ ఉద్గారాలను తప్పనిసరిగా తగ్గించాలని ఆయన పేర్కొన్నారు. ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం, గ్రీన్ హౌస్ వాయువులు మరియు వాతావరణ కాలుష్య కారకాలను పర్యవేక్షించడం, ఉపశమన లక్ష్యాలలో పరిశ్రమలను ఏకీకృతం చేయడం ద్వారా పీసీబీ వాతావరణ చర్యలకు కార్యాచరణ వెన్నెముకగా నిలుస్తోంది. పరిశ్రమలలో గాలి నాణ్యతను పర్యవేక్షించడం మరియు జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (NCAP) ద్వారా ఉద్గార పరిమితులను అమలు చేస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించడానికి టీజీపీసీబీ పర్యావరణ చట్టాలు మరియు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఏకకాలంలో వాతావరణ మరియు ప్రజారోగ్య సహ-ప్రయోజనాలను సాధిస్తూ, పార్టిక్యులేట్ మ్యాటర్ను తగ్గించడానికి పీసీబీ రాష్ట్రాల వారీగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ఆయన వివరించారు.

ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డులను అత్యుత్తమ మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీలు), పరిశ్రమలు, ఆరోగ్యం మరియు అనుబంధ సేవలు, పాఠశాలలు మరియు కళాశాలలకు అందజేశారు. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సామాజిక భాగస్వామ్యం, పర్యావరణహిత పద్ధతులు, ఆరోగ్యం మరియు పర్యావరణ అవగాహన వ్యాప్తిలో వారు చేసిన గణనీయమైన కృషికి గాను. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరత పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, డబ్ల్యూఈడీ 2026 సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి కోసం వినూత్న పరిష్కారాలను తెలియజేస్తూ, హరిత శక్తి, పర్యావరణ అనుకూల సాంకేతికతలు మరియు ఎకో ప్లాస్టిక్లపై వివిధ ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేశారు. గాలి మరియు నీటి నాణ్యత, గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలు మరియు పరిశ్రమలలో ఏర్పాటు చేసిన రియల్టైమ్ ఆన్లైన్ పర్యవేక్షణ కేంద్రాలను పర్యవేక్షించే కమాండ్ కంట్రోల్ నమూనాపై కూడా టీజీపీసీబీ ఒక స్టాల్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు సి. సత్యనారాయణ రెడ్డి, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్సార్టియం అధ్యక్షుడు, టి. విజయలక్ష్మి, జేఎన్టీయూ-హైదరాబాద్. చీఫ్ ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ రఘు, టీజీపీసీబీ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.