పీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట అంతమ్మగూడెం కాలుష్య బాధితుల ఆందోళన

  • కెమికల్‌ పరిశ్రమలను మూసేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు వినతి

ఎన్నో ఏండ్లుగా కాలుష్య కోరల్లో మగ్గుతున్నా తమ బాధను ఎవరు పట్టించుకోవడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా అంతమ్మగూడెం కాలుష్య బాధితులు, ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని వాపోతున్నారు. కాలుష్యం వెదజల్లే రసాయన పరిశ్రమలను తమ గ్రామం చుట్టూ ఏర్పాటు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. తమ పిల్లలు అనేక రోగాల బారిన పడి ప్రాణాలు పోతుంటే దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ.. కాలం వెల్లదీస్తున్నామని రోదిస్తున్నారు. తమ రోదనలు, బాధలు కాలుష్య నియంత్రణ మండలి (PCB) అధికారులకు పట్టట్లేదని వాపోతున్నారు. సనత్‌ నగర్‌లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయానికి తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి.. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రసాయన పరిశ్రమల యజమానులతో కొంతమంది PCB అధికారులు కుమ్మక్కై తమ జీవితాలను నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్లే వ్యవహరిస్తున్నారని.. దున్నపోతు ఫొటోను ప్రదర్శిస్తూ.. పర్యావరణ దినోత్సవం రోజు (జూన్ – 05) PCB ప్రధాన కార్యాలయం ముందు నిరసన తెలిపారు. పర్యావరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని కలిసి తమ బాధలు చెప్పుకొందామంటే అనుమతివ్వకపోవడంతో గేటు ముందు బైఠాయించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యాలయం లోపలే ఉన్నా కనీసం వినతి పత్రం ఇవ్వడానికి కూడా అధికారులు, పోలీసులు అనుమతించడం లేదని కాలుష్య బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పర్యావరణ దినోత్సవం రోజున సంబంధిత శాఖ మంత్రి అయిన కొండా సురేఖని కలిసి బాధితులు వినతి పత్రం ఇస్తే.. పరిశీలిస్తాం.. అధికారులకు చెప్తాం.. అంటూ వెళ్లిపోయారు. కాలుష్య నియంత్రణ మండలి (PCB) మెంబర్ సెక్రెటరీ జి. రవి కి వారి బాధలను చెప్పుకోనియకుండా దీనిపైన ప్రత్యేక సమావేశం పెడదామని కొందరు అధికారులు మంత్రిని మభ్యపెట్టారని బాధితులు ఆరోపించారు. కనీసం మంత్రిని తమతో కొంత సమయం మాట్లాడనీయకుండా అధికారులు అడ్డుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడం గ్రామ పరిసరాల్లో హెజోలో లాబొరేటరీ, శ్రీజయ, వినీత్‌, బృందావన్‌, కెమిక్‌ లైఫ్‌ సైన్స్‌, ఆప్టిమస్‌ డ్రగ్స్‌, విజెసాయి, ఎస్‌వీఆర్‌, ఆర్కిమెడిస్‌, రావూస్‌, సెన్సేషనల్‌, ఎస్వీఆర్‌ ట్రేడర్స్‌ లాంటి రసాయన పరిశ్రమల నుంచి విష వాయువులు వెలువడుతూ గాలి, జల కాలుష్యం వెదజల్లుతున్నది. ఈ పరిశ్రమలు వదిలే కాలుష్య కారకాలతో అక్కడి ప్రజలు గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు జన్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. PCB అధికారులు మాత్రం వారి గోడు పట్టించుకోకుండా పరిశ్రమల యజమానులకు కొమ్ముకాస్తున్నారు. కనీసం పర్యావరణ మంత్రి కొండా సురేఖ ఇప్పటికైనా తమ బాధను పట్టించుకోని ఆయా రసాయన పరిశ్రమలను మూసేయాలని కాలుష్య బాధితులు, ప్రజలు వేడుకుంటున్నారు.