- ప్రస్తుతం అనేక దేవాలయాల్లో కృత్రిమ నూలుతో మరమగ్గాలతో, మిల్లుల్లో తయారైన శాలువాలు వినియోగిస్తున్నారని మంత్రికి వివరించిన అంజయ్య
- గజం అంజయ్య సూచనలను సానుకూలంగా స్వీకరించిన మంత్రి కొండా సురేఖ
- ఈ దిశగా గజం అంజయ్య చేస్తున్న కృషిని ప్రశంసించిన మంత్రి
- పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికుల పాత్ర అమూల్యమని ప్రశంస
- ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగం దిశగా ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ
- చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు ఆశీర్వచనంగా చేనేత రంగం ద్వారా తయారు చేసిన శాలువాలను మాత్రమే అందించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ చేనేత కళాకారుడు గజం అంజయ్య అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని కోరారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ గారిని ఈ రోజు జూబ్లిహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా చేనేతకారులు స్వచ్ఛమైన నూలుతో తయారైన శాలువాతో మంత్రిగారిని సత్కరించారు.
యాదాద్రి, భద్రాచలం, బాసర, వేములవాడ తదితర ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొనే భక్తులకు అందించే శాలువాలు ప్రస్తుతం పెద్దమొత్తంలో మరమగ్గాలు, మిల్లుల్లో కృత్రిమ నూలుతో తయారవుతున్నాయని ఆయన మంత్రి సురేఖ గారికి వివరించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధిస్తున్న పరిస్థితుల్లో సింథటిక్ నూలుతో తయారైన శాలువాల వినియోగాన్ని కొనసాగించడం సముచితం కాదని తన అభిప్రాయాన్ని మంత్రి సురేఖ గారికి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో చేనేత రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
పవిత్రమైన దేవాలయాల్లో భక్తులకు అందించే శాలువాలు స్వచ్ఛమైన పత్తి లేదా పట్టు చేనేత వస్త్రాలతో తయారైతే వాటికి మరింత ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువ చేకూరుతుందని అంజయ్య మంత్రి సురేఖ గారికి తెలిపారు. అదే సమయంలో ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది చేనేత కార్మికులకు స్థిరమైన ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు తెలంగాణ చేనేత సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని వివరించారు. అందువల్ల రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో చేనేతతో తయారైన పవిత్ర శాలువాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వం తగిన విధాన నిర్ణయం తీసుకోవాలని అంజయ్య మంత్రిగారికి విజ్ఞప్తి చేశారు.
గజం అంజయ్య గారు చేసిన సూచనలు, ప్రతిపాదనలను మంత్రి కొండా సురేఖ గారు సానుకూలంగా స్వీకరించారు. ఈ దిశగా కృషి చేస్తున్న గజం అంజయ్యను మంత్రి సురేఖ అభినందించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భారతీయ సంప్రదాయాల సంరక్షణలో చేనేత కార్మికులు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని ఆమె కొనియాడారు. ఆలయాల్లో చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా సంప్రదాయ పరిరక్షణతో పాటు చేనేత కార్మికుల జీవనోపాధికి ఊతం లభిస్తుందని అన్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సాధ్యాసాధ్యాలను పరిశీలించి చేనేత రంగానికి మద్దతుగా తగిన చర్యలు చేపడతామని గజం అంజయ్యకు హామీ ఇచ్చారు. చేనేత రంగ పురోగతికి, చేనేత కార్మికుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.