హైదరాబాద్ : ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర రవాణా, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తో కలిసి వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మొహర్రం కార్యక్రమాలు నిర్వహించే ఆశుర్ ఖానాల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఆశుర్ ఖానాల పరిసర ప్రాంతాలలో పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్, రోడ్లు మరమ్మత్తు పనులను వెంటనే పూర్తి చేయాలని, అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లను ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, వాటర్ బోర్డ్ అధికారులు తాగు నీటి సరఫరా చేయాలని, జి.హెచ్.ఎం.సి అధికారులు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని అన్నారు. మొబైల్ టాయిలెట్స్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్ అండ్ బి అధికారులు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
మొహర్రం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రధాన ఊరేగింపు ప్రారంభం కానున్న బీబీ-కా-ఆలం పరిసరాల ప్రాంతంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఆశుర్ ఖానాలకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సూచించారు. వైద్య శిబిరాలు, అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ వైస్ ఛైర్మన్ ఫహీం కురేషీ, చార్మినార్, బహదూర్పురా, యాకత్ పురా, నాంపల్లి, కార్వాన్, మల్కాజిగిరి ఎమ్మెల్యేలు, మీర్ జుల్ఫెకర్ అలీ, మహమ్మద్ ముబీన్, జాఫర్ హుస్సేన్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహియుద్దీన్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, మీర్జా రహ్మత్ బేగ్, వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబైదుల్లా కొత్వాల్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్(HMWSSB) ఎండీ అశోక్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా, వక్ఫ్ బోర్డు CEO తదితరులు పాల్గొన్నారు.