లంచం తీసుకుంటే ట్రాప్.. అక్రమాస్తులుంటే రైడ్

  • అవినీతి నిరోధక శాఖ(ACB) దూకుడు
  • రెండేళ్లలో 441 కేసులు నమోదు
  • శివబాలకృష్ణ నుంచి మోహన్ నాయక్ దాకా కోట్లాది అక్రమ ఆస్తులు వెలికి తీస్తున్న వైనం
  • ఏసీబీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకోవడానికి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ట్రాప్ చేయడం ఆనవాయితీ. అయితే ట్రాప్ ల నుంచి మొదలైన ఏసీబీ వేట.. రెండున్నరేళ్లలో టాప్ అధికారుల అక్రమ సంపదనల దాకా చేరింది. 2024 నుంచి ఇప్పటివరకు ఏకంగా 441 కేసులు నమోదు చేసి అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ వణుకు పుట్టిస్తోంది. గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువగా ఏసీబీ వార్తల్లో కనిసించేవారు. ప్రస్తుతం కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారులు వరుసగా ఏసీబీ వలలో చిక్కుతున్నారు. శివబాలకృష్ణ కేసుతో మొదలైన అవినీతి సొరచేపల వేట.. మోహనా నాయక్ లాంటి తిమింగలం వరకు కొనసాగింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో ఏసీబీ కేసులు అతి తక్కువగా నమోదయ్యాయి. 2021లో 83, 2022లో 105 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేయగా, 2023లో ఆ సంఖ్య 95కు చేరింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏసీబీ అధికారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్చ ఇచ్చింది. దీంతో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కారు రేసుతో సహా పలు కేసుల విచారణను ఏసీబీ అధికారులు చేపట్టారు. 2024లో 152 కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. 2023తో పోలిస్తే 57 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అంటే 60 శాతం కేసుల పెరుగుదల ఏసీబీ అధికారుల దూకుడును స్పష్టం చేస్తోంది. గత ఏడాది 199 కేసులు నమోదు చేశారు. అంటే 2024తో పోలిస్తే దాదాపు 31శాతం కేసుల పెరుగుదల కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 90 కేసులు నమోదు చేశారు.

2021లో కేవలం 2 అక్రమాస్తుల (డీఏ) కేసులే నమోదు కాగా గత ఏడాది డీఏ కేసుల సంఖ్య 15కి చేరింది. అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా ఉన్న సమయంలో డీఏ కేసుల సంఖ్య 2022లో 17కి చేరింది. ఆ తర్వాత హఠాత్తుగా ఆయనను బదిలీ చేశారు. దీంతో 2023కు వచ్చేవరకు డీఏ కేసుల సంఖ్య 7కి తగ్గింది. అనంతరం 2024లో 11, 2025లో 15 డీఏ కేసులను ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 డీఏ కేసులు నమోదయ్యాయి. కాగా, రెండున్నరేళ్లలో నమోదైన డీఏ కేసుల్లో కొన్ని తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏ అధికారిని ఏసీబీ టచ్ చేసినా వందలకోట్ల అక్రమార్జన బయటపడటం తీవ్ర సంచలనం సృష్టించింది.

  • టీఎస్ రెరా కార్యదర్శి, హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ శివ బాలకృష్ణ రియల్ ఎస్టేట్ అనుమతుల్లో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. తొలిసారి జరిపిన తనిఖీల్లో రూ.20 కోట్లు, ఆ తర్వాత జరిపిన సోదాల్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తుల ఆనవాళ్లను ఏసీబీ అధికారులు వెలికితీశారు.
  • కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఎన్.శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి దాదాపు రూ.60 కోట్ల అక్రమ సంపాదననను గుర్తించారు.
  • విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ దాదాపు రూ.70 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
  • హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి రూ.50 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది.
  • వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ ఇంట్లో రూ.కోటి పది లక్షల నగదుతో పాటు రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డాయి.

డీఏ కేసుల్లో ఉన్నతాధికారులే ఎక్కువ!
ఏసీబీ కేసులకు సంబంధించి తహసీల్దార్లు, సబ్ రిజి స్ట్రార్ కార్యాలయ ఉద్యోగులు, పోలీసు, రెవెన్యూ విభాగాల్లోని వారు ఎక్కువగా ట్రాప్ కేసుల్లో పట్టుబడ్డారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో పట్టుబడ్డ ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, లక్షల కొద్దీ నగదు, ఖరీదైన విల్లాలు, వ్యవసాయ భూముల పత్రాలు పెద్ద ఎత్తున పట్టుబడటం గమనార్హం. ఆయా ఆస్తులను అధికారులు కొనుగోలు చేసినపుడు ఉన్న మార్కెట్ రిజిస్ట్రేషన్ విలువను మాత్రమే ఏసీబీ అధికారులు పేర్కొంటుండగా, వాస్తవ విలువ ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని పత్రికా ప్రకటనల్లో పేర్కొంటున్నారు. (సోర్స్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి)