కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ సమస్యలపై సానుకులంగా ఉన్నారు
  • కాంట్రాక్టర్ల అత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమే..
  • గత ప్రభుత్వం పెట్టి పోయిన పెండింగ్ బిల్లులు మా ప్రభుత్వం చెల్లించింది.
  • మీ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
  • కేవలం ఆర్ అండ్ బి శాఖలోనే గత ప్రభుత్వం రూ.4,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు పెట్టిపోయారు.
  • కాంట్రాక్టర్లు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించుకొని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతున్నాను.
  • సెక్రటేరియట్లో ధర్నా చేసింది మా అసోసియేషన్ కాదు: DVN రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్
  • మా పెండింగ్ బకాయిలను పరిష్కరించాలని మంత్రిని కలిసి చర్చించాం
  • ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని సానుకులంగా స్పందించారన్న కాంట్రాక్టర్స్

హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వేల కోట్ల రూపాయల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు… బిల్డర్స్, కాంట్రాక్టర్ లతో మంత్రుల నివాస సముదాయంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పెట్టి పోయిన బకాయిలో ఆర్ అండ్ బి శాఖలోనే గత ప్రభుత్వం నుంచి దాదాపు రూ.4,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని, యాదాద్రి దేవస్థానం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు సైతం ఇప్పటికీ రూ.350 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గత 30 నెలల్లో (కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్ అండ్ బి) కాంట్రాక్టర్లకు రూ.3,000 కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామని, ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన మొత్తం బకాయిలు ఒక దశలో రూ.8,000 కోట్లకు చేరాయని గుర్తుచేశారు. గత బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నాగర్‌ కర్నూల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి సహా ఆరుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తీవ్రంగా కలచివేశాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలోనే కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు జరిగాయని వాళ్ల “తమ వాళ్లనే అనుకున్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని అరోపించారు. అవసరం లేని ప్రాజెక్టులపై లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ రైతాంగానికి, ప్రజలకు అత్యంత అవసరమైన బ్రాహ్మణ వెల్లంల , ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఆ మూడు జిల్లాల్లో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమయ్యారని” మంత్రి విమర్శించారు.. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. చిన్న కాంట్రాక్టర్లు, ఎల్ఈడీ లైట్ల పనులు చేసిన సంస్థలు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే రూ.140 కోట్ల మేర చెల్లింపులు జరిపామని వెల్లడించారు.
ఈ నెల 18న ప్రతిపాదించిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించుకోవాలని తెలంగాణ బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కోరినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, అత్యవసర మరమ్మతుల పనులు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సమ్మె లేదా ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. 3,4 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క గారితో సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, మూడు నెలల వ్యవధిలో పెండింగ్ బకాయిల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రోడ్ల మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అపూర్వ స్థాయిలో చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లాలో వంద ఎకరాల్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి రూ.13,000 కోట్ల విలువైన హ్యామ్ రోడ్లు పనులకు త్వరలో శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. తెలంగాణ చరిత్రలోనే ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడం అరుదైన ఘట్టమన్నారు.

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని రూ.10,410 కోట్ల వ్యయంతో ఆరు లేన్లు, రెండు సర్వీస్ రోడ్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని, త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. అమరావతి, మచిలీపట్నం దిశగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, నల్గొండ జిల్లాలో డ్రై పోర్ట్ ప్రతిపాదన, మంచిర్యాల–నాగపూర్ కనెక్టివిటీ వంటి పలు కీలక ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ కృషితో ముందుకు సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల పరిధిలో ఇప్పటికే రూ.20,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు, ఒప్పందాలు పూర్తయ్యాయని, అనేక ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. దేశంలోనే ఉత్తమ రహదారులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంట్రాక్టర్లు సహకరిస్తే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతమవుతాయని అన్నారు. “పదేళ్లలో జరిగిన నష్టాన్ని ఒక్కరోజులో సరిచేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. కాంట్రాక్టర్లు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విరమించుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పునరుద్ఘాటించారు.

డీవీఎన్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ..
ఆత్మహత్య లు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసమే మేము చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికే రెండు సార్లు డిప్యూటీ సీఎంను కలిస్తే, దశల వారిగా మాకు బిల్లులు చెల్లిస్తామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో మా సమస్యలు చర్చించాం. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని సానుకులంగా స్పందించారని డివిఎన్ రెడ్డి మీడియాతో పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం,జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి,బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు,పలువురు కాంట్రాక్టర్స్ ఉన్నారు.