- ఆరోగ్యమే అభివృద్ధికి అసలైన సూచిక
- పేదలకు అండగా నిలవడమే నిజమైన వైద్యం
- వైద్యం సామాన్యుడికి అందుబాటులో ఉండాలి
- వ్యాధి చికిత్స కంటే నివారణే మిన్న
ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమిట్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైద్య రంగ నిపుణులు, ప్రముఖ వైద్యులు, హాస్పిటల్స్, ఫార్మా, బయోటెక్నాలజీ, డిజిటల్ హెల్త్ రంగానికి చెందిన ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆరోగ్యం అనేది కేవలం ఒక ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదన్నారు. ప్రతి ఒక్కరి ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని, వారి జీవితాంతం దాచుకున్న పొదుపు మొత్తం ఒక్క క్షణంలో కరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడు ఎటువంటి భయం లేకుండా ఆసుపత్రిలో అడుగుపెట్టేలా తక్కువ ధరకు వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. దేశం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలోనే తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎయిమ్స్ వంటి ఉన్నతమైన వైద్య విద్యాసంస్థలను స్థాపించి దేశానికి ఒక దిశను చూపించారన్నారు. పేద దేశంలో వైద్యం అనేది విలాసంగా మారకూడదనే ఉద్దేశంతో ఆనాడు పునాది వేశారన్నారు. అదేవిధంగా 1975లో ఇందిరా గాంధీ గారు తీసుకొచ్చిన సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకాన్ని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో తీసుకొచ్చిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లారన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో వచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, ఆశా వర్కర్ల వ్యవస్థ గ్రామీణ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చివేసిందని గుర్తుచేశారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చిందన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ చావుకు దగ్గర కాకూడదని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి నిదర్శనమని అన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందిస్తూ, గుండె, కిడ్నీ వంటి ఖరీదైన జబ్బులకు సైతం పేదవాడు ధైర్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా ఈ పథకం అండగా నిలిచిందన్నారు.
వైద్య రంగంలో వస్తున్న టెక్నాలజీ, టెలిమెడిసిన్, సరికొత్త పరికరాలు కేవలం కార్పొరేట్ వర్గాలకే పరిమితం కాకుండా అట్టడుగు వర్గాలకు సైతం అందాలని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. నాయకత్వం అనేది ఒక సర్టిఫికేట్ కాదు, అదొక బాధ్యత అని వ్యాఖ్యానిస్తూ, సైన్స్ అనేది సామాన్యుడికి, టెక్నాలజీ అనేది పేదవాడికి సేవ చేయాలన్నారు. ప్రస్తుత వైద్య విధానం వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించే ‘ఇల్నెస్ కేర్’ గా మాత్రమే ఉండిపోకూడదన్నారు. వ్యాధి రాకుండా ముందే నివారించే ‘వెల్నెస్ కేర్’ గా మారాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఐసీయూల కంటే వ్యాధి నివారణే అత్యంత చౌకైన మార్గమని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ నేడు దేశంలోనే పబ్లిక్ హెల్త్ క్యాపిటల్‌గా అవతరించిందని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని జిల్లా ఆసుపత్రుల బలోపేతం, వైద్య విద్యాసంస్థల విస్తరణ, నర్సింగ్ మరియు పారామెడికల్ రంగాలను ప్రోత్సహించడం ద్వారా వైద్య రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని అన్నారు. వైద్య రంగంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం అనేది కేవలం వ్యాపార లాభాల కోసం కాకుండా, ప్రభుత్వ ఆశయాలకు ప్రైవేట్ రంగానికి ఉన్న నైపుణ్యాలను జోడించి ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడానికే ఉపయోగపడాలని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వచ్చే దశాబ్ద కాలంలో వైద్య రంగానికి అవసరమైన మానవ వనరులను, నైపుణ్యాలను అందించడానికి తెలంగాణ పూర్తిగా సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉన్న బలమైన ఫార్మాస్యూటికల్ బేస్, మెడికల్ డివైజెస్ పార్క్, ఐటీ టాలెంట్ మరియు ప్రభుత్వ అండదండల వల్ల తెలంగాణ ప్రపంచంలోనే మెడికల్ ఎక్సలెన్స్ ఇకోసిస్టమ్కు కేంద్రంగా మారిందన్నారు. ఇక్కడి నుంచే భారతదేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే సరికొత్త హెల్త్ కేర్ ప్రొటోకాల్స్, డయాగ్నోస్టిక్స్ మరియు డిజిటల్ ప్లాట్ఫార్మ్లు రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు.