కేంద్ర మంత్రులను కలిసిన తెలంగాణ మంత్రులు తుమ్మల, ఉత్తమ్

  • తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కేంద్రానికి వినతులు
  • ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించాలి.. దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలి
  • తెలంగాణకు తక్షణమే డీఏపీ, యూరియా సరఫరా చేయాలి
  • పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోలుపై 25 శాతం పరిమితి ఎత్తివేయాలి
  • మొక్కజొన్న, జొన్నలను కేంద్రం MSPపై కొనుగోలు చేయాలి

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని బృందం మంగళవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంటనూనెల ఉత్పత్తి పెంపుపై విస్తృతంగా చర్చించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) లక్ష్యాలను అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి తుమ్మల వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించగా, 70 వేల మందికిపైగా రైతులు ఈ పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే మూడేళ్లలో ఈ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

భారత్ ప్రస్తుతం వంటనూనెల అవసరాల్లో దాదాపు 60 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన NMEO-OP కార్యక్రమం దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. అయితే ఇటీవల క్రూడ్ పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 44 శాతం నుంచి 16 శాతానికి తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతి సుంకం తగ్గింపుతో విదేశాల నుంచి చౌక ధరలకు పామాయిల్ దిగుమతులు పెరిగి దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతున్నాయని, దీనివల్ల ఆయిల్ పామ్ రైతులు ఉత్పత్తి చేస్తున్న ఫ్రెష్ ఫ్రూట్ బంచ్ (FFB)లకు గిట్టుబాటు ధర లభించడం లేదని వివరించారు. దీర్ఘకాలిక పంట అయిన ఆయిల్ పామ్ సాగుకు రైతులు భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ధరల అనిశ్చితి రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. దిగుమతి సుంకాన్ని తిరిగి 44 శాతానికి పెంచడం ద్వారా దేశీయ ఆయిల్ పామ్ రైతులకు రక్షణ కల్పించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్, ఎడిబుల్ ఆయిల్ స్వయం సమృద్ధి లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయని మంత్రులు పేర్కొన్నారు. అలాగే ఆయిల్ పామ్ రైతులకు కనీస గ్యారంటీ ధర (Minimum Guaranteed Price – MGP) విధానాన్ని అమలు చేసే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలించాలని కోరారు.

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆయిల్ పామ్ రైతుల భవిష్యత్తు దృష్ట్యా దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించి రైతులకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో డి.ఎ.పి, యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు మరియు వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి, రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఎరువుల సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లపై ప్రస్తుతం అమలులో ఉన్న 25 శాతం పరిమితి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధర (MSP) కింద కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని ఆ పరిమితిని పూర్తిగా తొలగించాలని కోరారు. దీంతో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు దేశ ఆహార భద్రత, దిగుమతుల తగ్గింపుకు కూడా దోహదపడుతుందని వివరించారు.

ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో సుమారు 15 లక్షల టన్నుల మొక్కజొన్న, 3 లక్షల టన్నుల జొన్నల ఉత్పత్తి నమోదైందని, మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే దిగువకు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆర్థిక భారం భరించి మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేసిందని, ఈ పంటలను కూడా కేంద్ర ప్రభుత్వ కొనుగోలు విధానంలో చేర్చి MSPపై సేకరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డాకు తెలంగాణలో ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ (NBS) విధానంలో మార్పులకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల పలు లేఖలు రాయగా… ఈ వినతులపై స్పందించిన కేంద్ర మంత్రి తెలంగాణలో యూరియా, డి.ఎ.పి. తదితర ఎరువుల లభ్యత, సరఫరాపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని శాఖ అధికారులను ఆదేశించినట్లు తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించిన అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించడం రైతాంగానికి ప్రయోజనకరంగా మారుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సమావేశాలలో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ ల వెంట ఎంపిలు రఘువీర్ మరియు కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.