రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. సంజయ్ 1992 బ్యాచ్ అధికారి. ఇదే బ్యాచ్‌కు చెందిన మరో ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లు జయేశ్ రంజన్, వికాస్ రాజ్‌ల నుంచి పోటీ ఎదురైనప్పటికీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. సంజయ్ వైపే మొగ్గు చూపారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సంజయ్.. తాను సీఎస్‌గా రావడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. దీంతో రేవంత్ ఆయనకే సీఎస్ పదవి కట్టబెట్టారు. ప్రస్తుత సీఎస్ కె.రామకృష్ణారావు పదవీ కాలం ఈ నెల 30తోముగియనుంది. ఆయన స్థానంలో సంజయ్ జాజును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఆయనకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, పరిశ్రమల పెట్టుబడుల విభాగం సీఈవోగా, ‘స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ(స్పీడ్)’ సీఈవోగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు.