- సీఎం ముఖ్యకార్యదర్శిగా ఎన్.శ్రీధర్
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొంత మందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గనులు, భూగర్భ వనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎన్.శ్రీధర్‌ను బదిలీ చేసి.. ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా నియమించింది. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న బి.అజిత్‌రెడ్డిని బదిలీ చేసి పరిశ్రమల శాఖలోని ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ విభాగం సీఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాల యూనిట్, కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌కు చేనేత శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, డైరెక్టర్‌గా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా, టీజీసీవో ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. వీటితోపాటు సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా కొనసాగాలని ఘోష్‌ను ఆదేశించింది. ఇక దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌కు అడవులు, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేసింది. అయితే దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న అహ్మద్ నదీమ్‌ను బదిలీ చేసి, సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) ముఖ్యకార్యదర్శిగా నియమించింది. మైనారిటీల సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.