PCB జోనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ ఇంటిపై ACB దాడులు

  • ఏకకాలంలో 5 చోట్ల తనిఖీలు
  • 17 తులాల బంగారం, 3.3 కేజీల వెండి, రూ. 5 కోట్ల అక్రమస్తుల గుర్తింపు
  • ఒప్పంద ఉద్యోగిగా చేరి.. కోట్లకు పడగలెత్తిన PCB JCEE మునిప్రసాద్
  • ఆదాయానికి మించిన అక్రమస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుల నేపద్యంలో ACB దాడులు..
  • ఏసీబీ తనిఖీల్లో ఆదాయానికి మించి ఆస్తులు గుర్తింపు, కేసు నమోదు
  • తెలంగాణ PCB అవినీతి అధికారులపై కూడా ACB కన్ను

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తిరుపతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సీనియర్ ఎన్విరాన్ మెంటల్ అధికారి యుగంధర మునిప్రసాద్ ఇంట్లో కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో శుక్రవారం సోదాలు చేశారు. ఏకకాలంలో ఏడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి రూ.5 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ అంతకు 4 రేట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కర్నూలు చెందిన మునిప్రసాద్ భారీగా ఆస్తులు సంపాదించారని ఆరోపణలున్నాయి. ఏసీబీ తనిఖీల్లో కర్నూలు ఏ.క్యాంప్ ఆదిత్యనగర్లో రూ.రెండు కోట్ల విలువైన జీ ప్లస్ 3 ఇండ్లు, రింగ్ రోడ్డు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న జీ ప్లస్ 3 విల్లా, వెంకటరమణ కాలనీలోని క్లౌడ్-9 అపార్టుమెంటులో ఓ ప్లాట్, భార్య ఉష పేరు మీద నన్నూరు సమీపంలో 170 గజాల స్థలం, జోహరాపురంలో 288 గజాల ఇంటి స్థలం, కల్లూరులో 266 గజాల ఇంటి స్థలం, ఇంట్లో 17 తులాల బంగారు ఆభరణాలు.. 3.2 కిలోల వెండి నగలు, డాక్యుమెంట్లు, ఎల్ఎసీ బాండ్లు, పోస్టాఫీసు పత్రాలు లభించాయి. వీటితో పాటు కర్నూలు ఎస్బీఐ ఎం.ఎస్.ఆర్ బ్రాంచిలో లాకరు ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు శనివారం దానిని తెరవనున్నారు. మునిప్రసాద్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

కర్నూలు చెందిన మునిప్రసాద్ 2001లో ఒప్పంద ప్రాతిపదికన తెలంగాణలోని మెదక్ జిల్లాలో PCB కార్యాలయంలో కెమికల్ ఇంజినీరుగా చేరారు. 2005లో రెగ్యులర్ కాగా, 2008లో కర్నూల్ కు బదిలీ అయ్యారు. తర్వాత వివిధ ప్రాంతాల్లో పనిచేసి 2025లో తిరుతికి వచ్చారు. ఆయన పనిచేసిన ప్రతి ఛోటా అవినీతి ఆరోపణలు రావటంతో ACB అధికారులు నిఘా ఉంచి, ఒకేసారి దాడి చేశారు.