సర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

హైదరనాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సర్ ప్రక్రియపై సోమవారం బిఆర్ కె భవన్ లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ ప్రారంభమైన కేవలం నాలుగు రోజులలోనే దాదాపు 1.73 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడంపై బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారుల పనితీరు పట్ల సిఇఒ అభినందించారు. నిర్ణీత గడువులోగా 100శాతం ఎన్యుమరేషన్ ఫారాలను అందజేసేందుకు సంబంధిత జిల్లా స్థాయి అధికారులు బిఎల్ఓలను ప్రోత్సహించాలని సూచించారు. BLOలు తమ విధులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR)-2026 కార్యక్రమంలో రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLAs) చురుకుగా పాల్గొని తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. AEROలు, EROలు విస్తృతంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు నిర్వహించి, BLOలకు అవసరమైన సూచనలు అందించి ప్రజలతో అనుసంధానం పెంచాలని, ఓటరు హెల్ప్‌లైన్ 1950, హెల్ప్‌డెస్క్ నంబర్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. DEOలు, EROలు, AEROలు ప్రతిరోజూ నిర్వహిస్తున్న ఓటరు అవగాహన కార్యక్రమాలను సమీక్షిస్తూ, సామాజిక మాధ్యమాల్లో క్రమం తప్పకుండా వివరాలను ప్రచురించాలని, అధికారుల క్షేత్ర పర్యటనలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా నింపడంలో ఓటర్లకు సహాయపడే ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించేలా BLOలకు మరో విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారులను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ ప్రధాన ఎన్నికల అధికారి (FAC) శ్రీ జి.ఎస్. చారి, అన్ని నోడల్ అధికారులు, పీఎం (ఐటీ), సాంకేతిక అధికారులు పాల్గొన్నారు.