హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మరింత విస్తరించే దిశగా గౌరవనీయ మైనారిటీస్ సంక్షేమ మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ఈ రోజు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్ (రూమ్ నెం.21, మొదటి అంతస్తు)లో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) ఆధ్వర్యంలో ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (OBMMS) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ మైనారిటీ మహిళల కోసం కుట్టు మిషన్ పథకం, అలాగే మోటార్ బైక్ / ఈ-బైక్ / స్కూటీ / ఈ-స్కూటర్ మరియు చిన్న వ్యాపార (పెట్టీ బిజినెస్) పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను మంత్రి గారు అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి మరియు స్వయం ఉపాధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పారదర్శకత, సాంకేతికత ఆధారిత సేవలు మరియు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే విధానాల ద్వారా యువత, మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ పథకాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మైనారిటీస్ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, మైనారిటీస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బి. షఫీయుల్లా, IFS, మైనారిటీస్ సంక్షేమ శాఖ డైరెక్టర్ అబ్దుల్ హమీద్, IAS, టీజీసీఎంఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పి. సబిత, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో పాటు మైనారిటీస్ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ అభ్యర్థులు 03 జూలై 2026 నుండి 18 జూలై 2026 సాయంత్రం 5:00 గంటల వరకు tsobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- అర్హతలు:
- కుట్టు మిషన్ మరియు పెట్టీ బిజినెస్ పథకాలకు వయస్సు 21 నుండి 55 సంవత్సరాలు.
- మోటార్ బైక్ / ఈ-బైక్ / స్కూటీ / ఈ-స్కూటర్ పథకాలకు వయస్సు 21 నుండి 50 సంవత్సరాలు.
- కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఉండాలి. మరిన్ని వివరాలకు 040-23391067 నంబర్‌ను సంప్రదించవచ్చు లేదా tscmfc.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం, స్వయం ఉపాధి, పారదర్శక పాలన మరియు సమగ్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి స్పష్టం చేశారు.