హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆహార భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, కల్తీ ఆహార పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం తనిఖీలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం సిఎస్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్ కంట్రోలర్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సమన్వయంతో పని చేస్తూ రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు, నాణ్యతలపై నిరంతరం తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఉన్న రెండు విభాగాలను ఏకతాటిపై నడిపేందుకు తగిన ప్రతిపాదనలను వారం రోజుల్లోగా సిద్ధం చేయాలని సిఎస్ సూచించారు. దీంతో ఆయా విభాగాలు సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవకాశం ఉందన్నారు. ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా తగిన విధంగా అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసులు, వాటి పురోగతి, సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో సిఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డిజిపి సి.వి.ఆనంద్, సిఎంఒ ప్రిన్సిపల్ సెక్రటరీలు శేషాద్రి, ఎన్.శ్రీధర్, జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, అడిషనల్ డిజి(ఇంటెలిజెన్స్) విజయ్ కుమార్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి.కర్ణన్, వైద్యశాఖ కమిషనర్ సంగీతా, డ్రగ్ కంట్రోలర్ డిజి అవినాష్ మొహంతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.