జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్, అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఐఎఎస్ తో కలిసి సోమవారం ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమ పురోగతిపై కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమం 7.7.2026(మంగళవారం) నాటికి ఎట్టి పరిస్థితులలో పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పట్టణ ప్రాంతం కలెక్టర్లు దీనిపై శ్రద్ధవహించి వందశాతం ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో సూపర్ వైజర్ల ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఎక్కడైతే బిఎల్ఒలు బలహీనంగా ఉన్నారో వారిని గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో వారికి సూపర్ వైజర్లు సహకరించాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడంలో స్థానికంగా వాలంటీర్లను గుర్తించి వారి ద్వారా పూరించేందుకు ఓటర్లకు సహకరించాలని సూచించారు. సంబంధిత సూపర్ వైజర్ల ఫోన్ నెంబర్లను మీడియా ద్వారా తెలియజేయాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరబాద్లో ఇప్పటికే ప్రారంభమైన 16 హెల్ప్ డెస్క్ లతో పాటు అవసరమైన చోట అదనంగా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సిఇఒ ఆదేశించారు. పూర్తయిన ఎన్యూమరేషన్ ఫారాలలో సదరు ఓటరు, బిఎల్ఒ సంతకాలు ఉండేలా చూడాలని దీంతో పాటు ఫోటోలు ఉండేలా చూడాలని సిఇఒ ఆదేశించారు. ఇఆర్ఒలు, ఎఇఆర్ఒలు విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వివిధ పోలింగ్ కేంద్రాలలో కాకుండా ఒకే పోలింగ్ కేంద్రంలో వారి పేర్లు ఉండేవిధంగా చూడాలన్నారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను కూడా బిఎల్ఒలు సరి చూసుకోవాలని, ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో మరోసారి బిఎల్ఒలకు, సూపర్ వైజర్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లను సిఇఒ ఆదేశించారు. బిఎల్ఒలు తప్పనిసరిగా రాజకీయ పార్టీలతో సమావేశాలు జరిగేవిధంగా చూడాలని, సర్ ప్రక్రియపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఇఒ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిప్యూటీ ఎన్నికల అధికారి చారి, డిప్యూటీ కలెక్టర్ (ఎస్ జి డిసి) చెన్నయ్య, పిఎం ఐటి చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు.