ప్రత్యేక మొక్కలతో నదుల శుద్ధి !

ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టి
ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధం
కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్, మురుగునీరు వంటివి నదులు, ఉప నదులు కాలుష్యం బారిన పడటానికి ప్రధాన కారణం అవుతున్నాయని పిసిబి పేర్కొంటుంది. మురుగు నీరు నదిలోకి చేరడానికి ముందే ప్రవాహ సమయంలో శుద్ధి చేయాలని కాలుష్య నియంత్రణ మండలి భావిస్తోంది. నీటి కాలుష్యంతో పాటు జలచరాలకు ప్రాణాంతకంగా మారుతున్న నీటిలో మురుగును తగ్గించి ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టి సారించింది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ విధానాలను అమలు చేస్తుండడంతో అధికారులను త్వరలో అధ్యయనానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాలుష్యం బారిన నదులు, ఉప నదులు..నదుల్లో కాలుష్య తీవ్రత పెరుగుతుండడంపై జాతీయ హరిత న్యాయస్థానం (ఎన్జీటి) పలు రాష్ట్రాలపై గతేడాది ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కాలుష్యం బారిన పడిన నదులు, ఉప నదులు ఉన్నాయి. సిపిసిబి వెల్లడించిన గణాంకాల ప్రకారం మొదటి స్థానం అస్సాం, రెండో స్థానం డామన్ అండ్ డయ్యూం, మూడోస్థానం డిల్లీలు చోటు దక్కించుకున్నాయి. మనరాష్ట్రంలోని మూసీ (హైదరాబాద్ టు నల్లగొండ), మంజీరా నది (గౌడిచెర్ల టు నక్కవాగు), నక్కవాగు (గండి లచ్చాపేట్ టు సెలవల్ తండా)ల్లో పారుతున్న నదులు అత్యంత కలుషితమైనవిగా సిపిసిబి గణాంకాలు పేర్కొన్నాయి. మనరాష్ట్రంతో పాటు మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కుందు (నంద్యాల టు మద్దూరు), తుంగభద్ర (మంత్రాలయం టు భావాపురం), గోదావరి (రాయన్‌పేట టు రాజమండ్రి), కృష్ణా (అమరావతి టు హంసలదీవి), నాగావళి (తోటపల్లి) మీదుగా ప్రవహించే నదుల్లోని నీరు కలుషితమయినట్టు సిపిసిబి గణాంకాలు పేర్కొన్నాయి
మొదటి దశలో మూసీ, రెండోదశలో నక్కవాగు..కాలుష్య తీవ్రత ఆధారంగా మొదటి దశలో మూసీ, రెండోదశలో నక్కవాగు, మంజీరా, మూడోదశలో గోదావరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కరకవాగు నాలుగోదశలో మానేరు, కిన్నెరసాని, ఐదో దశలో కృష్ణానదిని కాలుష్యం నుంచి బయటపడేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ ప్రణాళికను పిసిబితో పాటు పురపాలక (జలమండలి, జిహెచ్‌ఎంసి) రెవెన్యూ తదితర శాఖలు అమలు చేయనున్నట్టుగా తెలిసింది.
ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి..నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు, మురుగునీటి శుద్ధికి ఎస్టిపిల నిర్మాణం వంటి చర్యలపై పిసిబి దృష్టిసారించింది. కాలువలో పారే మురుగునీటిని నీటి లో కలపడానికి ముందే బయోరెమిడియేషన్, ఫైటో రెడియేషన్ వంటి ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేయాలని పిసిబి భావిస్తోంది. తొలుత మూసీ, నక్కవాగు, మంజీరా నదుల పునరుజ్జీవానికి కార్యాచరణ అమలుకానుంది. దీనిని 2022 మే నాటికి పూర్తిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. మురుగునీటి కారణంగా నదుల్లో కాలుష్యం పెరుగుతోంది. ఈ నీటిలో ఆక్సిజన్ శాతం పడిపోవడం వల్ల జలచరాలకు ప్రాణాంతకం అవుతోందని పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. సూక్ష్మజీవులతో పాటు కొన్నిరకాల మొక్కలను ఉపయోగించి మురుగునీటి ప్రవాహ సమయంలో కాలుష్య కారకాలను తగ్గించాలన్న లక్షంగా ప్రస్తుతం పిసిబి ముందుకెళుతుంది. కొన్ని రకాల మొక్కలు ఆక్సిజన్ అధికంగా విడుదల చేస్తాయని, ఈ పద్ధతులను ఏ రాష్ట్రాల్లో అమల్లో చేస్తున్నారో అధ్యయనం చేసి అనంతరం రాష్ట్రంలో ఆ విధానాలను పాటించాలని పిసిబి భావిస్తోంది.
క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆరా..నదులు, ఉప నదుల్లో ఆక్సిజన్ సున్నాకు చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిపై పిసిబి ఆరాతీస్తోంది. గతంలో జీడిమెట్ల పరిసరాల్లో ఉన్న పరిశ్రమల నుంచి వ్యర్థజలాలు హుస్సేన్‌సాగర్‌లో కలిసేవి. దీంతో సాగర్ ప్రక్షాళనలో భాగంగా వ్యర్థాలు సాగర్‌లో కలవకుండా పటిష్టమై న చర్యలు తీసుకుంది. వ్యర్థజలాలకు సంబంధించిన నాలాలను మళ్లీంచి అంబర్‌పేట వద్ద నున్న మూసీనదిలో కలిసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయి నా కొన్ని పరిశ్రమలకు చెందిన వారు కిందిస్థాయి అధికారులతో కుమ్మక్కై నిర్వహణ మరమ్మతుల పేరిట గతం లో మాదిరిగానే వ్యర్థ జలాలను సాగర్‌లోకి మళ్లీస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యధావిధిగా ప్రమాదకర రసాయన వ్యర్థాలు సాగర్‌తో పాటు చెరువులు, కుంటల్లో కలుస్తున్నాయని దీంతో ఆక్సిజన్ శాతం జీరోకు పడిపోయిందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
తగ్గుతున్న డిఓ.. పెరుగుతున్న బిఓడి..అందులో భాగంగా హుస్సేన్‌సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్, హస్మత్‌పేట, ఫ్యాక్స్‌సాగర్, రంగదాముని చెరువు, నల్ల చెరువు, సరూర్‌నగర్, నూర్ మహ్మద్ కుంట తదితర చెరువుల్లో పరీక్షలు నిర్వహించారు. దీనికయ్యే వ్యయాన్ని సీపీసీబీ, టీఎస్‌పీసీబీలు భరిస్తాయి. ఆయా చెరువుల్లో పీహెచ్, టోటల్ డిసాల్వడ్ (టీడీఎస్), డిజాల్వ్‌డ్ ఆక్సిజన్ (డీవో), నైట్రేట్ , బయోటాజికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), ఫాస్పేట్, బొరాన్, కోలిఫాం తదితర తీవ్రతలను లెక్కిస్తారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, శామీర్‌పేట చెరువులో మాత్రమే జలచరాలు బ్రతికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.
డిఓ తగ్గడం వలన బిఓడి పరిమాణం పెరగడమే ప్రధాన కారణమని టిఎస్‌పిసిబి అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో నీటిలో ఎనరోబిక్ బ్యాక్టీరియా పెరుగుతుందని, అవి పారిశ్రామిక రసాయన వ్యర్థాల్లో ఉండే సల్ఫైట్ నుంచి ఆక్సిజన్‌ను ఆహారంగా స్వీకరిస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో మిగిలిపోయింది హైడ్రోజన్ సల్ఫైడ్‌గా మారుతుంది. ఫలితంగా జలచరాలు జీవించలేని స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. (Source: MT)