- ఐఐఎం, ఐఐటీలు సాధించాల్సిందే
- సత్తుపల్లి , కోయగూడెం బ్లాకులు సింగరేణికి ఇవ్వాలి
- ప్రజాస్వామ్య స్ఫూర్తితో రాష్ట్రం కోసం కేంద్రాన్ని ఎన్నిసార్లైనా కలుస్తాం
- రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు సాధిద్దాం
ఎలాంటి భేషజాలు లేకుండా, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మహాత్మా జ్యోతీ రావు ఫూలే ప్రజాభవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన వాటాలను, నిధులను సాధ్యమైనంత వరకు సాధించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎంపీలు అందించిన ప్రతి సలహాను, సూచనను ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు నోట్ చేసుకున్నారని, వాటన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి వివిధ శాఖల సెక్రెటరీలు, మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం రాసే ప్రతి లేఖ ప్రతులను తప్పనిసరిగా తెలంగాణ భవన్ స్పెషల్ సెక్రెటరీకి పంపాలని ఆయన చెప్పారు. గతంలో పంపిన లేఖలు, భవిష్యత్తులో పంపే ఉత్తరాలు, పెండింగ్ అంశాలన్నింటినీ శాఖల వారీగా క్రోడీకరించి ఒక స్పష్టమైన డ్రాఫ్ట్ తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు అందజేస్తారు. దీని ద్వారా ఎంపీలు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీలకు తక్షణ సమాచారం, సహకారం అందించడం కోసం తెలంగాణ భవన్‌లో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక టీమ్‌ను అందుబాటులో ఉంచుతుందని ప్రకటించారు. క్వశ్చన్ అవర్‌లో సప్లిమెంటరీ ప్రశ్నలు అడగడానికి అవసరమైన డేటాను ఈ టీమ్ అందిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘ఫెడరల్ స్పిరిట్’ (సమాఖ్య స్ఫూర్తి), ప్రజాస్వామ్య విలువలను తాము బలంగా నమ్ముతామని డిప్యూటీ సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలిసిన ప్రతి సందర్భంలోనూ ఒక పార్టీ తరఫున కాకుండా, ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం’గానే వెళ్తున్నామని ఆయన ప్రకటించారు. తెలంగాణ ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని.. ప్రజాప్రభుత్వంలో భాగమైనా మేము.. రాజకీయాలు చేయడం లేదని చెప్పారు. వివిధ కార్యక్రమాల వల్ల సమావేశానికి రాలేకపోయిన ఇతర ఎంపీలను కూడా కలిసి, ఈ సమన్వయ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని అధికారులను ఆయన కోరారు.
భవిష్యత్తులో పార్లమెంట్ నోటిఫికేషన్ రాగానే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేస్తామని, తద్వారా క్వశ్చన్ అవర్ కంటే ముందే ప్రశ్నలు పంపుకోవడానికి వీలవుతుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రస్తుత సమావేశాల నేపథ్యంలో.. క్వశ్చన్ అవర్, జీరో అవర్, స్టాండింగ్ కమిటీలు, కన్సల్టేటివ్ కమిటీల వంటి అందుబాటులో ఉన్న ప్రతి ఫార్మాట్‌ను ఉపయోగించుకొని కేంద్రం దృష్టికి రాష్ట్ర అంశాలను తీసుకెళ్లాలని ఎంపీలను డిప్యూటీ సీఎం కోరారు. దీనితో పాటు అందరూ కలిసి డెలిగేషన్ లాగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిస్తే దానికి ప్రాముఖ్యత ఉంటుందని, మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ముఖ్యమంత్రి గానీ, తాను గానీ స్వయంగా ఢిల్లీకి వస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అక్కడ ఎంపీలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఏ ఏ అంశాలపై ఒత్తిడి తేవాలనే దానిపై చర్చిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలం లేకుండా సింగరేణికే కేటాయించేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిప్యూటీ సీఎం చెప్పారు. గతంలో ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించిన సత్తుపల్లి, కోయగూడెం 3 బ్లాకులను తిరిగి సింగరేణికి కేటాయించేలా కేంద్రం మీద ఈ సమావేశాల్లో ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుతంరంగ సంస్థ అయిన సింగరేణిని బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
హైదరాబాద్‌కు సెమీకండక్టర్ వంటి భారీ ప్రాజెక్టు రావడం అనేది ఒక పెద్ద ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సెమీకండక్టర్ ప్రాజెక్టును తీసుకురావడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. భవిష్యత్ అంతా సాంకేతికతపైనే ఆధారపడి ఉన్నందున, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. జీఎస్టీ వచ్చినప్పటి నుంచి పన్నులన్నీ రాష్ట్రం నుంచి కలెక్ట్ అయ్యి సెంట్రల్ పూల్‌కి వెళ్తున్నాయి. అక్కడ నుంచే పంపిణీ జరుగుతోందన్నారు. కాబట్టి కేంద్రం దగ్గరకు వెళ్లి మన రాష్ట్ర వాటాను మనం తెచ్చుకోవడం మినహా వేరే మార్గం లేదుని ఎంపీలతో భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ప్రజాప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు, ఎన్నిసార్లు అయినా కలవడానికి సిద్ధమని డిప్యూటీ సీఎం చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల క్లియరెన్సులకు సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌ను ఎంపీలకు అందిస్తామని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రితో కలిసి అందరూ కేంద్రానికి రిప్రజెంట్ చేయాలని కోరారు. రాష్ట్రానికి రావలసిన ఐఐఎం (IIM), ఐఐటీ (IIT) వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను తప్పనిసరిగా సాధించుకోవాల్సి ఉందన్నారు. రైల్వే నెట్‌వర్క్ విస్తరణ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన భూసేకరణ లేదా ఇతర సహకారాలను వంద శాతం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.