యునాని వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసి, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయుష్ శాఖ పనితీరు, నిజామియా టిబ్బీ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, నిర్మాణ పనులు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ రాష్ట్రంలో యునాని వైద్య సేవలకు ప్రతిష్ఠాత్మక సంస్థలని మంత్రి పేర్కొన్నారు. వాటి అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. హాస్పిటల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్, ఫార్మసీ భవనం పనులను వేగవంతం చేయాలని టీజీఎంఎస్ఐడీసీ చీఫ్ ఇంజనీర్‌ను మంత్రి ఆదేశించారు. వచ్చే జనవరి నాటికి నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
హాస్పిటల్లో డాక్టర్లు, టీచింగ్ ఫాకల్టీ, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వైద్య సేవలు, విద్యా కార్యకలాపాలపై ప్రభావం పడకుండా వెంటనే ఖాళీల భర్తీకి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి సూచించారు. యునాని డిస్పెన్సరీలు, హాస్పిటల్స్‌లో అవసరమైన మందులు, పరికరాలు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు మాట్లాడుతూ.. ఆయుష్‌లో గతేడాది 138 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడంతో, డాక్టర్ల కొరత తీరిందన్నారు. నిజామియా టిబ్బీ కాలేజీ, నిజామియా జనరల్ హాస్పిటల్ వారసత్వ భవనాల పునరుద్ధరణ, కొత్త భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.52.50 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించినట్లు వివరించారు. అవసరమైన యునాని మందుల కొనుగోలు, పంపిణీ కూడా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా శాఖ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కూడా మంత్రి ఆరా తీశారు. రాష్ట్ర స్థాయి యునాని డ్రగ్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధం చేసిన ప్రాజెక్టు ప్రతిపాదనను వేగవంతం చేయాలని సూచించారు. మౌలాలిలోని ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ భవనానికి సంబంధించిన సమస్యలను పరిశీలించి, అక్కడ యునాని వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆయుష్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబు, నిజామియా టిబ్బీ హాస్పిటల్ సూపరింటెండెంట్, శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.