భద్రాద్రి కొత్తగూడెం సహా, రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకొస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో, దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా దూరాన్ని బట్టి హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తామని, అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలను మంజూరు చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లలను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనుకయ్య, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవిందర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఈ రెండున్నర సంవత్సరాల్లో జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన్లలో వైద్య సేవలు గణనీయంగా మెరుగయ్యాయన్నారు. జిల్లాలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారని, హాస్పిటళ్లలో అన్నిరకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ అవేర్‌నెస్ కార్యక్రమాలు కూడా చేపడుతోందన్నారు. కొత్తగూడెం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మంత్రిని కోరారు. ఎంసీహెచ్, జీజీహెచ్ నడుమ డిస్టన్స్ ఎక్కువగా ఉందని, ఈ నేపథ్యంలో ఎంసీహెచ్‌కు ప్రత్యేకంగా ఒక ఇంచార్జ్ సూపరింటెండెంట్‌ను నియమించాలన్నారు. కొంత మంది డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూనంనేని కోరారు. జిల్లాలో ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, కొత్తగా 4 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసినందుకుగానూ ఎమ్మెల్యేలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్‌కు అనుబంధంగా అంబులెన్స్‌లను మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. కొత్తగూడెం జిల్లాల్లోని ఏరియా హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పీహెచ్‌సీలలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వాటిని అప్‌గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. టీచింగ్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్‌సీలలో జనరేటర్లు ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, తమది అటవీ ప్రాంతం అయినందున వర్షాల సమయంలో పవర్ కట్ సమస్య ఉంటుందని, ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పీహెచ్‌సీలలోనూ జనరేటర్లను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదు అన్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలోనే ఐటీడీఏ పీవోలతో సమావేశం నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ మంజూరు చేశామన్నారు. సీహెచ్స్ఈలు, ఏరియా హాస్పిటల్స్‌కు అనుబంధంగా అంబులెన్స్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 డయాలసిస్ సెంటర్లు ఉండగా, కొత్తగా మరో 4 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేవలం 20 నిమిషాల ప్రయాణంతో పేషెంట్ డయాలసిస్ సెంటర్‌కు చేరుకునేలా డయాలసిస్ నెట్‌వర్క్‌ను విస్తరించామని తెలిపారు. భద్రాచలం, అశ్వరావుపేట, ఎల్లందు సహా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఏరియా హాస్పిటల్స్‌లో సీటీ స్కాన్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామి ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోరినట్టుగా కొత్తగూడెం సహా అటవీ ప్రాంతాల్లో ఉన్న అన్ని పీహెచ్‌సీల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు. కొమురారం హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు, ఎల్లందు హాస్పిటల్‌లో కొత్త ఐసీయూను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిలో ఎవరికైనా భద్రాచలం, అశ్వారావుపేట వంటి అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉంటే.. వారికి ఆయా హాస్పిటళ్లలోనే పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రిన్సిపల్ సెక్రటరీకి మంత్రి సూచించారు. అదే సమయంలో, విధుల పట్ల నిర్లక్ష్యం వహించే డాక్టర్లు, సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని హెల్త్ సెక్రటరీనిని మంత్రి ఆదేశించారు. కొత్తగూడెం ఎంసీహెచ్‌లో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్‌ను మానిటర్ చేసేందుకు ఒక డాక్టర్‌ను ప్రత్యేకంగా నియమించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్స్‌లో డాక్టర్లు, సిబ్బంది అటెండెన్స్ మానిటరింగ్ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యేలకు మంత్రి వివరించారు. ఎమ్మెల్యేలు రెగ్యులర్‌గా హాస్పిటల్స్‌ను విజిట్ చేయాలని మంత్రి సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
కొత్తగూడెం జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. అన్నిరకాల మెడిసిన్, డయాగ్నస్టిక్ కిట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన వైద్య పరికరాలు ప్రతి హాస్పిటల్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందించాలని సూచించారు. 108, 102 అంబులెన్స్ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల రోడ్డు కనెక్టెవిటీ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది కాబట్టి, డెలివరీ డేట్ దగ్గర పడిన గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ హాల్స్‌కు తరలించాలని, అక్కడ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు. హైరిస్క్ గర్భిణుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.