ఉన్నత విద్యాసంస్థల్లో వివక్షకు చరమగీతం పాడుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • సచివాలయంలో ‘రోహిత్ వేముల చట్టం’ ముసాయిదాపై క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  • ఆనాటి హామీని నెరవేరుస్తున్న ప్రజా ప్రభుత్వం.. వివక్ష లేని విద్యా విధానమే మా లక్ష్యం
  • సమగ్ర ముసాయిదా నివేదికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
  • సమావేశానికి హాజరైన మంత్రులు (కమిటి సభ్యులు) దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.

ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు, 2026 రూపకల్పనపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి కీలక సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం  అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్  లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో వివక్ష లేని ప్రశాంత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం చట్టాన్ని అత్యంత పటిష్టంగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో జరిగిన రోహిత్ వేముల విషాద ఉదంతం కేవలం తెలంగాణనే కాకుండా దేశం మొత్తాన్ని కదిలించిందని ఆయన అన్నారు. ఆనాడు వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటంలో ప్రస్తుత లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ  స్వయంగా యూనివర్సిటీకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆనాడు విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా నేను ( భట్టి విక్రమార్క)మంత్రి శ్రీధర్ బాబు,  క్రియాశీలక నేత పొన్నం ప్రభాకర్ మేమంతా పెద్ద ఎత్తున పోరాడాం. భవిష్యత్తులో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి వివక్ష లేని విద్యా విధానాన్ని, చట్టాన్ని తీసుకువస్తామని ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మా ప్రభుత్వం ఈ రోజు నెరవేర్చడానికి రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తుందని వివరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలని, వివక్ష కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండకూడదన్న రాహుల్ గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటయిందని ఆయన స్పష్టం చేశారు.

అధికారులకు డిప్యూటీ సీఎం  ఆదేశాలు
బిల్లు రూపకల్పన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  బిల్లు డ్రాఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.  కొత్త చట్టానికి సంబంధించిన సమగ్ర విధివిధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా (Draft) నివేదికను సిద్ధం చేయాల్సిందిగా సంబంధిత శాఖ సెక్రటరీని ఆదేశించారు. కర్ణాటకలో ఇప్పటికే ఇటువంటి చట్టం కోసం జరుగుతున్న ముసాయిదా ప్రయత్నాలను పరిశీలించి, అక్కడి ఉత్తమ పద్ధతులను స్వీకరించాలని సూచించారు. ఈ చట్టం రూపకల్పనలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తామని, ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని  ప్రకటించారు. వివిధ రాజకీయ పక్షాల నేతలు, ప్రజా సంఘాలు, స్టూడెంట్ అసోసియేషన్ల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామని.. ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి బిల్లులో తుది మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, క్యాబినెట్ సబ్-కమిటీ ఆమోదం పొందిన అనంతరం ఈ చారిత్రాత్మక బిల్లును త్వరలోనే రాష్ట్ర శాసనసభ (అసెంబ్లీ) ముందుకు తీసుకువస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

న్యాయపరంగా పటిష్టంగా ఉండాలి:
ఈ చట్టానికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు, సుప్రీంకోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్‌ను ప్రత్యేక ఆహ్వానితురాలిగా పిలిపించి చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. కొలంబియా లా స్కూల్ (న్యూయార్క్) నుండి ఎల్.ఎల్.ఎమ్ పూర్తి చేసిన ఆమె అనుభవం చట్టాన్ని అత్యంత సమగ్రంగా, లోపరహితంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.