- గోదావరి జలాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక
- చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం
- ప్రజా ప్రభుత్వంలో పైసా వృథా కాకుండా ‘సీతారామ’ పూర్తి
- సీతారామ ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి సమీక్ష
గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా గరిష్టంగా వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి ముందుకు వెళుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా వస్తున్న వాతావరణ మార్పులు, విపత్కర పరిస్థితులను తట్టుకునేలా ముందే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. మూడు రోజుల క్రితం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సమ్మక్క బారేజ్ బ్యాక్ వాటర్ నుంచి నీటిని పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయడం కోసం అన్ని పంపులను ఆన్ చేయడమే కాకుండా, అక్కడ ఉన్న దాదాపు 12 జిల్లాల్లో, 17 నియోజకవర్గాలు, 22 రిజర్వాయర్లను నింపే కార్యక్రమానికి స్వయంగా అక్కడే ఉండి రివ్యూ నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ వద్దకు కూడా వచ్చి రివ్యూ నిర్వహించి, ఎక్కడికక్కడే ఆదేశాలు ఇస్తూ పనులు వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఇక్కడికి రావడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నదిపై ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందించాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఆనాడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జలాలను జిల్లా రైతులకు అందించాలనే ఉద్దేశంతో లోతుగా అధ్యయనం చేసి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం జరిగిందని అన్నారు. అప్పుడు ఇదే స్థానం నుంచి పనులు ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆనాడు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌ను ₹1,681 కోట్లతో 2 లక్షల ఎకరాలకు నీరందించేలా ప్లాన్ చేశారని అన్నారు. గోదావరి – శబరి నదులు కలిసేప్రాంతం రుద్రంకోట వద్ద ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ₹1,824 కోట్లతో మరో 2 లక్షల ఎకరాలకు నీరందించేలా పనులు ప్రారంభించారని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా 4 లక్షల ఎకరాలకు ₹3,505 కోట్లతో నీరందించేలా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. రాష్ట్ర విభజనకు ముందే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు ₹2,000 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం ₹1,505 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే ఈ ప్రాజెక్టులను కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో రీడిజైనింగ్ చేసిందన్నారు. ఈ రీడిజైనింగ్ వల్ల సీతమ్మ సాగర్ బారేజ్‌తో కలుపుకుని దాదాపు ₹24,000 కోట్లకు ప్రాజెక్ట్ వ్యయాన్ని పెంచడం జాతిగిందని అన్నారు. అందులో దాదాపు ₹7,500 నుంచి ₹8,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందని అన్నారు.
పిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ గా నేను సభలోనూ, బయట వివరాలతో సహా ఈ దోపిడీని ఎండగట్టామని అన్నారు. ఆనాడు రెండు ప్రాజెక్టులను కంప్లీట్ చేయమని చెప్పినా వినకుండా కేసీఆర్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ దాష్టీకాలను గమనించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేబినెట్ మొత్తం కలిసి ఈ ప్రాజెక్టులపై దీనిపై సుదీర్ఘంగా సమీక్ష చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే చాలా డబ్బు ఖర్చు పెట్టారు కాబట్టి ప్రాజెక్ట్‌ను ఆపడం సరికాదని, దీనిని కొనసాగించి పూర్తి చేయాలని కేబీనెట్ నిర్ణయించిందని అన్నారు.
డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకపోవడం, రిజర్వాయర్ల కెపాసిటీ సమస్యలను సరిదిద్దుతూ, సాగర్ కెనాల్‌తో లింక్ చేస్తూ రాజీవ్ కెనాల్‌ను యాడ్ చేయడం, వైరా రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్‌లను లింక్ కెనాల్స్ , టన్నెల్స్ ద్వారా నింపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపముఖ్యమంత్రి చెప్పారు. సత్తుపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు నెలవారి క్యాలెండర్ ను ఏర్పాటు చేసుకొని సమీక్షలు నిర్వహిస్తూ పూర్తిచేసే దిశగా ముందుకు వెళుతున్నట్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇది ప్రజల ప్రభుత్వం. ఏ ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా, జరిగిన పనులను ముందుకు తీసుకు వెళుతూ.. ప్రయారిటైజ్ కింద తీసుకుని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం స్పష్టంగా ప్రకటించారు. గోదావరి నదిలో చివరన ఉన్న ఈ ప్రాజెక్ట్ నుండి గరిష్టంగా నీటిని తీసుకుని అనాదిగా ఎదురుచూస్తున్న జిల్లా రైతాంగ ఆశలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విస్పష్టంగా ప్రకటించారు.