గురుకులాల్లో మరో ప్రభంజనం.. నీట్‌లో మెరిసిన సాంఘిక సంక్షేమ విద్యార్థులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • సుమారు 333 మందికి పైగానే విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలు లభించే అవకాశం
  • విద్యపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యల ఫలితమే ఈ అద్భుత విజయం

హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు (TGSWREIS) మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నాయి. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-2026)లో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచగా, సుమారు 333 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్‌తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
NEET 2026 ఫలితాలు శుక్రవారం విడుదలైన సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ…ఈ ఘన విజయం తెలంగాణ ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయంతో కూడిన విద్యా విప్లవం రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థుల జీవితాలను మార్చగలిగే శక్తి విద్యకే ఉందనే దృఢ విశ్వాసంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

నాణ్యమైన విద్య, అత్యాధునిక మౌలిక వసతులు, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక శిక్షణ, డిజిటల్ లెర్నింగ్, పోటీ పరీక్షలకు ప్రత్యేక అకాడమీలు, ఉచిత నివాసం, పోషకాహారం, నిరంతర అకడమిక్ పర్యవేక్షణ వంటి చర్యల ఫలితంగానే గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత విజయాలు నమోదు చేస్తున్నారని మంత్రి వివరించారు. విద్యార్థుల విజయం వెనుక వారి కఠోర శ్రమ, తల్లిదండ్రుల విశ్వాసం, అధ్యాపకుల అంకితభావం, ప్రిన్సిపాళ్ల నాయకత్వం, అకడమిక్ బృందాల నిరంతర పర్యవేక్షణ, అధికారుల సమన్వయ కృషి ఉన్నాయని మంత్రి కొనియాడారు.

గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది విద్యార్థుల భవిష్యత్తును తమ బాధ్యతగా భావించి పనిచేస్తున్నారని ప్రశంసించారు. వారి సేవలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తిస్తుందని, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమం, అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం నిరంతరం సహకరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల విద్యాసంస్థలపై ఉంచిన విశ్వాసం ఈ విజయాలకు బలమైన పునాది అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని మంత్రి కోరారు.

వైద్య విద్యలో ప్రవేశం సాధించబోతున్న ప్రతి విద్యార్థికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ…వారు ఉత్తమ వైద్యులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. గురుకుల విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థానాల్లో నిలిచి తెలంగాణకు మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ అద్భుత ఫలితాల సాధనలో కీలక పాత్ర పోషించిన సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి విజయేంద్ర బోయి, IAS, TGSWREIS కార్యదర్శి (FAC) శ్రీమతి కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ (అకాడమిక్ )సక్రు నాయక్, అదనపు కార్యదర్శులు, అకడమిక్ విభాగం అధికారులు, ప్రాంతీయ సమన్వయ అధికారులు (RCOలు), నాన్-కోఆర్డినేటింగ్ అధికారులు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, కోచింగ్ బృందాలు, బోధనేతర సిబ్బందిని మంత్రి అభినందించారు.