వైద్యం, విద్యపై పెట్టే ఖర్చు ఉచిత సంక్షేమం కాదు.. రాష్ట్ర ప్రగతికి పెట్టుబడి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ​సేవాలాల్ భవన్‌లో ​ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలో 247 మంది నర్సింగ్ అధికారుల నియామక పత్రాల అందజేత
  • వైద్య, విద్యా, ఉద్యోగ రంగాల్లో విప్లవాత్మక మార్పులు!
  • ​రికార్డు స్థాయిలో 76 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసిన ప్రజా ప్రభుత్వం
  • ​44 వేలకు పైగా పడకల సామర్థ్యంతో దేశంలోనే అగ్రగామిగా వైద్య రంగం

వైద్యం, విద్యారంగాలపై ప్రభుత్వం పెట్టే ఖర్చు కేవలం ఉచిత సంక్షేమం మాత్రమే కాదని, అది మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచేందుకు మానవ వనరులపై పెట్టే దీర్ఘకాలిక పెట్టుబడి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు సేవాలాల్ భవన్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తో కలిసి నియామక పత్రాలను డిప్యూటీ సీఎం అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గత పది సంవత్సరాల ప్రభుత్వ హయాంలో కార్మికుల హక్కులు, కనీస వేతనాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గతంలో ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశంలోనూ కనీస వేతనాల సవరణ గురించి నిలదీశానని, కానీ నాటి ప్రభుత్వం ఏనాడూ సరైన సమాధానం ఇవ్వలేదని గుర్తుచేశారు. అయితే, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి  బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి, దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను సాధించి జీవోలను విడుదల చేశారని కొనియాడారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో మందుల కొరత ఉండకుండా పేదలకు సక్రమంగా మందులు పంపిణీ జరగడానికి మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని గ్రీన్ ఛానల్ లో 30 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి వెసలు బాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

​కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈఎస్ఐ ఆసుపత్రుల రూపురేఖలను మార్చబోతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆసుపత్రులలో అధునాతన డయాలసిస్ యూనిట్లు, సీటీ స్కాన్ సౌకర్యాలు, బర్న్స్ వార్డులు, కార్డియాక్ కేర్ సెంటర్లను వేగంగా ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది కొరతను అధిగమిస్తామని ప్రకటిస్తూ, రానున్న రోజుల్లో అదనంగా 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 గురు డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు మరియు ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత  రికార్డు స్థాయిలో 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.

“​రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు. సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేయడానికి ప్రతి నెలా నిధులను విడుదల చేస్తున్నామని చెప్పారు.. నిమ్స్  విస్తరణ పనులకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 44,029 పడకల  సామర్థ్యంతో దేశంలోనే అత్యధిక సగటు పడకలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. అలాగే ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ద్వారా దాదాపు 75 లక్షల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 16 మెడికల్ కాలేజీలకు అదనంగా నూతనంగా 9 మెడికల్ కాలేజీలను, 16 నర్సింగ్ కాలేజీలను, 28 పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించేందుకు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వెల్లడించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌, హైదరాబాదులో స్కిల్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేసి, అత్యాధునిక కంప్యూటరైజ్డ్ మిషనరీతో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విదేశీ ఉద్యోగాల కోసం టామ్ కామ్ (TOMCOM) ద్వారా శిక్షణ పొందే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ప్రతి నెలా ₹2,000 ల స్టైపెండ్ అందిస్తూ ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు.

పదేళ్లుగా నిరాశానిస్పృహల్లో ఉన్న నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తూ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి పారదర్శక విధానంలో రికార్డు స్థాయిలో 76 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి, అర్హులకు నియామక పత్రాలను అందజేశామన్నారు
​నూతనంగా నియామక పత్రాలు అందుకున్న నర్సింగ్ అధికారులను అభినందిస్తూ, నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది ఆపదలో ఉన్న దీన జనులకు ప్రేమతో సేవలు అందించే ఒక పవిత్రమైన సేవ అని కొనియాడారు. ఈ వృత్తి ద్వారా లభించిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుని లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తూ, వాటిని ప్రజల చెంతకు చేర్చడంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయబోదని పునరుద్ఘాటించారు.