పేదోడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • గ్రామం నుంచి మహానగరం వరకు ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పిస్తాం
  • క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం శ్రీకారం

హైదరాబాద్ : రాష్ట్రం లో పేదవాడి సొంతింటి కల నెరవేరే వరకు ఇందిరమ్మ ఇళ్ల యజ్ఞం నిరంతరంగా కొనసాగుతుందని ఇది ఒకసారి చేపట్టి ముగించే కార్యక్రమం కాదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచారం పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో గూడు లేని ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి చివరి లబ్ధిదారుని వరకు గౌరవప్రదమైన సొంతింటిని నిర్మించి అందించే వరకు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని అన్నారు . పేదల సొంతింటి కలలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. క్యూర్ (CURE) పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇళ్ల కార్యక్రమాన్ని సోమవారం రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన, సౌకర్యవంతమైన సొంత నివాసం కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదల ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటికే సుమారు రెండు లక్షల ఇళ్లు పూర్తై లక్షలాది కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయని, మిగిలిన ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. గత నెల 2వ తేదీన ఆసిఫాబాద్‌ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. రెండో విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించిన ప్రభుత్వం, ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల సొంతింటి కలను కూడా నిజం చేయబోతోందని మంత్రి పేర్కొన్నారు.

క్యూర్ పరిధిలో లక్ష ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అంతో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. పేదల ఇళ్ల కోసం నగరంలో కోట్ల రూపాయల విలువైన అత్యంత కీలక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించిందని, ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను బట్టి ఒక ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు స్థలాలను సేకరించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాల మాదిరిగా నగరానికి దూరంగా కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి గారు స్పష్టం చేశారు. కుటుంబాల జీవనోపాధికి, పిల్లల చదువులకు, ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అధునాతన సౌకర్యాలతో బహుళ అంతస్తుల (పది అంతస్తుల వరకు) భవనాల నిర్మాణం చేపట్టి, ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకుని అమలు చేస్తున్న ఈ పథకంలో ఆ నియోజకవర్గ ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు కలిపి మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని, గత ఏడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాల జీవితాల్లో సొంతింటి వెలుగులు నింపుతున్న ప్రజా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.