- ఉద్యోగుల ప్రాణాలు బలి తీసుకున్న రసాయన పరిశ్రమలు
- భద్రతా ప్రమాణాలు గాలికి.. తనిఖీలు శూన్యం
- ఐదు నెలల్లో నాలుగు భారీ ప్రమాదాలు..
- ముగ్గురు బలి, డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు
- తాజాగా ఏజీఎం వెంకటకృష్ణారెడ్డి దుర్మరణం
- రాజకీయ అండదండలతోనే యాజమాన్యాల నిర్లక్ష్యం
- లంచాల మత్తులో అధికారులు..
- ఫ్యాక్టరీల చట్టం ప్రకారం నియంత్రణ ఎక్కడ..? తనిఖీలపై లక్ష ప్రశ్నలు..?
- కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న రసాయన పరిశ్రమలు అగ్నిగుండాలను తలపిస్తున్నాయి. యాజమాన్యాల నిర్లక్ష్యం, లాభాల వేటలో కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటున్న తీరువెరసి.. ఈ ఫ్యాక్టరీలు నిత్యం కార్మికులకు యమపాశాలుగా మారుతున్నాయి. తాజాగా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని ‘హాజెలో లాబరేటరీస్’లో జరిగిన ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పరిశ్రమలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం) కమ్ షిప్ట్ ఇన్ఛార్జ్ గా విధులు నిర్వహిస్తున్న ఎ. వెంకటకృష్ణారెడ్డి (44) రసాయన రియాక్టర్లో పడి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన భద్రతా లోపాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. గడిచిన ఐదు నెలల వ్యవధిలోనే వరుసగా నాలుగు భారీ ప్రమాదాలు జరిగి ముగ్గురు బలికావడంతో ఉమ్మడి జిల్లా నల్లగొండ ప్రజలు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు.
హాజెలోలో గతంలోనూ ప్రమాదాలు
హాజెలో లాబరేటరీస్ లో భద్రతాలోపాలు బయటపడడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇదే రియాక్టర్ వద్ద విషవాయువులు లీకై ఇద్దరు ఉద్యోగులు ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు వారం రోజుల పాటు హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, ఈ విషయాన్ని యాజమాన్యం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టింది. ప్రమాదానికి గురైన ఆ ఇద్దరు ఉద్యోగులను విధులలో నుంచి తొలగించి, వ్యవహారం సర్దుమణిగేలా జాగ్రత్తపడింది. పాత ప్రమాదాల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకోకపోవడం, కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే నేడు ఒక సీనియర్ అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు నెలల్లో జరిగిన వరుస ఘోరాలు ఇవే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన ఐదు నెలల వ్యవధిలోనే నాలుగు చోట్ల భారీ రియాక్టర్ పేలుళ్లు, రసాయన ప్రమాదాలు సంభవించాయి. ఫిబ్రవరి 14న చౌటుప్పల్ డివిజన్ లోని ఓ గ్రామంలో ఉన్న బృందావన్ ల్యాబ్స్ రియాక్టర్ పేలి భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 20న దోతిగూడెం గ్రామంలో ఉన్న విజె సాయి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒక కెమిస్ట్ అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదవగా, మరికొందరు కార్మికులు గాయపడ్డారు. ఏప్రిల్ 9న ఇదే నోస్ ఫార్మా పరిశ్రమలో రక్షణా చర్యల లోపంతో అంతకు ముందు పరిశ్రమలో మంటలు లేచి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మే 1న నల్లగొండ జిల్లా చిట్యాల మండలం బోంగోనిచెరువు గ్రామ సమీపంలోని నోస్ ఫార్మా ల్యాబ్ లో రియాక్టర్ పేలి ఒక యువ కెమిస్ట్ తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు.
ఫ్యాక్టరీల చట్టం ప్రకారం నియంత్రణ ఎక్కడ..? తనిఖీలపై లక్ష ప్రశ్నలు..?
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, బీబీనగర్ మండలాలతో పాటు నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి, వెలిమినేడు తదితర గ్రామాల్లో అత్యధికంగా రసాయన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ప్రతి పరిశ్రమలోనూ తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఆకస్మిక తనిఖీలు మాత్రం జరగడం లేదు. తనిఖీలపై లక్ష ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు లంచాల మత్తులో ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఇక్కడున్న పెద్ద పరిశ్రమలన్నీ ప్రముఖ రాజకీయ పార్టీల నేతలకు, ప్రజాప్రతినిధులకు చెందినవి కావడం, వారి అండదండలు ఉండడం వల్ల, అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు బలంగా ఉన్నాయి. తాజాగా హాజెలో ల్యాబ్స్ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ వెంకన్న నేతృత్వంలో అధికారులు పరిశ్రమను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రియాక్టర్ పరిసరాలను పరిశీలించి, యాజమాన్యం నిబంధనలను తుంగలో తొక్కినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, సేకరించిన పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఈఈ వెంకన్న స్పష్టం చేశారు.
కాలుష్యంతో ప్రజారోగ్యానికి ముప్పు
ఈ రసాయన పరిశ్రమలు కేవలం కార్మికుల ప్రాణాలకే కాక, చుట్టుపక్కల గ్రామ ప్రజల మనుగడకు కూడా ముప్పుగా మారాయి. వాయు, జల కాలుష్యాన్ని విచ్చలవిడిగా విడుదల చేస్తుండడంతో తాగే నీరు, పీల్చేగాలి, తినే పంటలు అన్నీ కలుషితమవుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యంగా మారాయని, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలలో తరచుగా భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతుండడం వల్ల సమీప గ్రామాల్లోని ఇండ్లు, గోడలు పగుళ్లు వస్తున్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
భద్రతా ప్రమాణాలను పాటించని, కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్మికుల ప్రాణ భద్రత, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాయి. కేవలం లాభాల కోసమే యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలను, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ రెడ్ కేటగిరీ పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలని స్థానికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, విచ్చలవిడి గా కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామ బాధితులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా పాలకులు అసహాయత వీడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.