మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి: ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి

  • సమకాలీన జర్నలిజంపై నిపుణుల విలువైన మార్గదర్శనం

“మీ కలం కత్తి కంటే పదునైనది.. సమాజానికి మేలు చేసే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలి. తెలంగాణ చరిత్రను వాస్తవాధారాలతో ప్రజల ముందుకు తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలి” అని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నాంపల్లిలోని అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన వనపర్తి జిల్లా విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజుల ఈ శిక్షణా కార్యక్రమంలో జర్నలిస్టులు మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన సమాచారాన్ని అందించాలని వక్తలు సూచించారు.

రెండో రోజు శిక్షణా కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కె. శ్రీనివాస్ “తెలంగాణ జర్నలిజం – గతం, వర్తమానం, భవిష్యత్తు” అంశాన్ని వివరిస్తూ మారుతున్న మీడియా ధోరణులు, డిజిటల్ యుగంలో జర్నలిస్టుల బాధ్యతలు, వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ప్రముఖ పాత్రికేయుడు చిల్లా మల్లేశం “భాష – తప్పొప్పులు, దిద్దుబాట్లు” అంశాన్ని ప్రస్తావిస్తూ వార్తా రచనలో శుద్ధమైన భాష, సరైన పదాల వినియోగం, భాషా ప్రమాణాలను పాటించడం జర్నలిస్టుల విశ్వసనీయతకు మూలమని వివరించారు.

సీనియర్ జర్నలిస్టు తోట భవానారాయణ “గ్రామీణ వార్తలు – ఎలక్ట్రానిక్ మీడియా” అంశాన్ని విశ్లేషిస్తూ గ్రామీణ సమస్యలు, ప్రజా అవసరాలు, అభివృద్ధి అంశాలను సమర్థవంతంగా ప్రజల ముందుకు తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని సూచించారు. మీడియా నిపుణుడు రవితేజ “మానవ అక్రమ రవాణా – బాలల వెట్టి చాకిరి నిర్మూలన” అంశంపై అవగాహన కల్పిస్తూ సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధితుల గౌరవం, గోప్యతను కాపాడే బాధ్యత మీడియాపై ఉందని వివరించారు.

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి “మీడియా – చట్టాలు, నైతిక నియమావళి, జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు” అంశాన్ని వివరిస్తూ, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం–2023 ద్వారా పత్రికల నమోదు ప్రక్రియను సరళీకరించి పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోకి తీసుకువచ్చారని తెలిపారు. గతంలో ఆర్‌ఎన్‌ఐ (RNI)గా ఉన్న సంస్థ ప్రస్తుతం ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI)గా కొనసాగుతోందని పేర్కొన్నారు. మీడియా చట్టాలు, నైతిక విలువలను పాటిస్తూ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాస్తవాధారిత వార్తలను అందించడం ప్రతి జర్నలిస్టు బాధ్యత అని అన్నారు. డిజిటల్ మీడియా విస్తరణ, సోషల్ మీడియా ప్రభావం, ఫేక్ న్యూస్ వ్యాప్తి, కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వంటి సమకాలీన పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టులు సమాచారాన్ని వాస్తవ నిర్ధారణ చేసిన అనంతరమే ప్రచురించాలని, విశ్వసనీయ వనరులను వినియోగిస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజంతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని వక్తలు సూచించారు.

శిక్షణా ముగింపు కార్యక్రమంలో చిన్నారెడ్డి పాల్గొన్న విలేకరులకు శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిపుణులు సమకాలీన జర్నలిజానికి సంబంధించిన పలు అంశాలపై అందించిన మార్గదర్శకాలు విలేకరులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని, ఈ శిక్షణ తమ వృత్తి నైపుణ్యాల పెంపునకు ఎంతో దోహదపడిందని పాల్గొన్న జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు, డీపీఆర్‌వో సీతారాం నాయక్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు, సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు, వివిధ జిల్లాల నుంచి హాజరైన జర్నలిస్టులు, అధికారులు పాల్గొన్నారు.