ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్‌పై సందేహాల నివృత్తికి కాల్‌సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

  • 040-24603572 ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి
  • యూపిఐ ద్వారానే రూ.10వేల ఇఎండి చెల్లించాలి
  • ఇల్లు రాక‌పోతే అదే ఖాతాకు తిరిగి చెల్లిస్తాం
  • ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఎలాంటి ప‌త్రాల స‌మ‌ర్ప‌ణ అవ‌స‌రం లేదు
  • ఆధార్ ఒక్కటి చాలు
  • ప‌దేళ్లు క్యూర్ ప‌రిధిలో నివాసం ఉన్న‌వారు అర్హులు

హైద‌రాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు నగర నడిబొడ్డున గౌరవప్రదమైన సొంతింటిని అందించాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తూ ప్రజా ప్రభుత్వం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ పథకంపై ప్రజల్లో ఎలాంటి గందరగోళం, అపోహలు లేకుండా దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంట‌ర్ హెల్ప్‌లైన్‌ను శనివారం హౌసింగ్ బోర్డు కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సందేహాలు ఉన్నా మ‌ధ్య‌వ‌ర్తుల‌ను న‌మ్మ‌కుండా నేరుగా 040-24603572 నంబర్‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయింత్రం 6గంట‌ల‌మ‌ధ్య‌ ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తుదారుల సౌక‌ర్యార్ధం తెలుగు , హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాష‌ల‌లో స‌మాచారం తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ప్రభుత్వం నుంచి సరైన సమాచారం అందించేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల నిర్మాణం ల‌క్ష్యంగా తొలివిడ‌త‌లో 16 నియోజకవర్గాలలో 7680 ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్లు తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఏ నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకోవాలని మంత్రిగారు సూచించారు. ద‌ర‌ఖాస్తు దారులు ఎలాంటి విష ప్ర‌చారాల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని మీ సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ పోర్టల్,వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవ‌చ్చున‌న్నారు.

హైదరాబాద్ క్యూర్ ఏరియా ప్రాంతంలో నివసిస్తున్న అల్పాదాయ వర్గాల కుటుంబాల కోసం ఈ పథకాన్ని రూపొందించామ‌ని కుటుంబ వార్షిక ఆదాయం ₹6.00 లక్షల వరకు ఉండాలి. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరించబడుతుందని అర్హత కలిగిన కుటుంబానికి ఒక ఫ్లాట్ మాత్రమే కేటాయించబడుతుందన్నారు. అందిన దరఖాస్తులను డిజిటల్ విధానంలో పరిశీలించడంతో పాటు, క్షేత్రస్థాయి పరిశీలన మరియు సమగ్ర ధృవీకరణ నిర్వహిస్తామన్నారు. నిర్మిస్తున్న ఫ్లాట్ల సంఖ్య కంటే అర్హులైన దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే, పారదర్శకమైన విధానంలో లాటరీ ద్వారా ఇండ్లను కేటాయిస్తామన్నారు. ద‌ర‌ఖాస్తుదారు క్యూర్ ప‌రిధిలో ప‌దేళ్లుగా నివాసం ఉండాల‌ని, ద‌ర‌ఖాస్తుదారు లేదా కుటుంబానికి ఓ ఆర్ ఆర్‌, క్యూర్ ప‌రిధిలో సొంత‌ ఇల్లు లేదా ఫ్లాట్ లేదా ప్లాట్ ఉండ‌కూడ‌ద‌ని, ఒక కుటుంబానికి ఒక ద‌ర‌ఖాస్తు ఒక ఫ్లాట్ మాత్ర‌మే కేటాయింపు ఉంటుంద‌ని తెలిపారు. ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఆధార్ నెంబ‌ర్ తెలియ‌జేస్తే స‌రిపోతుంద‌ని ,కుల‌, జీత భ‌త్యాల ధృవీక‌ర‌ణ పత్రాల‌ను అప్ లోడ్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని లాట‌రీ స‌మ‌యంలో వీటిని స‌మ‌ర్పించ‌వ‌చ్చున‌ని తెలిపారు.

ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో 10 వేల రూపాయిల చెల్లింపున‌కు యూపిఐ లేదా నెట్ బ్యాంకింగ్‌ను మాత్ర‌మే ఉప‌యోగించాల‌ని, ఒక వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే తిరిగి అదే ఖాతాకు ఆ మొత్తం వాప‌సు అవుతుంద‌న్నారు. ప‌రిశీల‌న‌, కేటాయింపు, వాప‌సు త‌దిత‌ర స‌మాచారం పూర్తయ్యేవ‌ర‌కు మీసేవ ర‌శీదు, చెల్లింపు ర‌శీదు, ద‌ర‌ఖాస్తు సంఖ్య‌, మొబైల్‌నెంబ‌ర్‌ల‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాల‌ని మంత్రి సూచించారు. ఈ పథకం కింద ప్రతిపాదించిన ఫ్లాట్లు ఒక బెడ్‌రూమ్, హాల్ మరియు కిచెన్‌తో, సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మిస్తున్నామ‌న్నారు. ఒక్కో ఫ్లాట్ ఖ‌రీదు 40 నుంచి 60 ల‌క్ష‌ల రూపాయిల వ‌ర‌కు ఉంటుంద‌ని, ఇందులో ప్ర‌భుత్వం ఐదు ల‌క్ష‌ల రూపాయిల స‌బ్సిడీతో పాటు అన్ డివైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గ‌జాల స్ధ‌లాన్ని కూడా ల‌బ్దిదారుని పేరిట రిజిస్ట్రేష‌న్ చేప‌డుతుంద‌న్నారు. ల‌బ్దిదారుడు కేవ‌లం ఆరు ల‌క్ష‌ల రూపాయిలు మాత్ర‌మే చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంద‌న్నారు. ఈకార్య‌క్ర‌మంలో హౌసింగ్ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వి.పి.గౌత‌మ్‌, హౌసింగ్ బోర్డు సీఈ ర‌మ‌ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.