- కోట్లు కొల్లగొట్టిన కిక్కు, మజాలో నిన్నటిదాకా అవినీతి అధికారుల డాబూదర్పం
- ఇప్పుడు వారే పరువుపోయిందనే బాధలో కటకటాల వెనుక బోరున ఏడుస్తున్న వైనం
- కొందరి మూగరోదన.. ములాఖత్‌కు దూరం
- ఏసీబీకి పట్టుబడిన ఉన్నతాధికారుల తీరిది
- ఏసీబీకి పట్టుబడిన తర్వాత బాధపడి ఏం లాభం..?
- నిజాయితీగా విధులు నిర్వర్తించి ఉంటే ఈ తిప్పలు తప్పేవి కదా.. అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..
- కన్ను మిన్ను కానకుండా ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టి.. ఏసీబీకి దొరికిన తర్వాత అధికారుల బాధ వర్ణనాతీతం..
చేతినిండా సొమ్ముంటే ఊరినిండా చుట్టాలే అని ఊరికే అన్నారా! డబ్బుంటే ఫేసుకు విలువొస్తుంది.. మాటకు బలమొస్తుంది.. మర్యాదా దొరుకుతుంది! కానీ ఆ పచ్చనోటు పిచ్చిలో పడిపోయి.. అవినీతికి పాల్పడి.. నాలుగు తరాలకు సరిపడా కోట్లలో సొమ్ము కూడబెడితే ఏం జరుగుతుంది? ఈ సంగతి ఇటీవల అవినీతి రొచ్చులో కూరుకుపోయి.. ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఉన్నతాధికారులకు బాగా తెలుసు! అప్పటిదాకా కింగులా దర్పం వెలగబెట్టి.. ఏసీబీ సోదాల్లో ఇబ్బడిముబ్బడిగా డబ్బు, బంగారు నగలు, ఆస్తిపత్రాలతో దొరికిపోయిన ఆ అధికారులు, ఇప్పుడు కటకటాల వెనుక వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అక్రమంగా సంపాదించిన ఆ సొత్తంతా ఒక్కసారిగా దూరమవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమ సంపాదనతో పాటు నిన్నటిదాకా సమాజంలో తమకున్న మర్యాదా మట్టి కొట్టుకుపోయిందని.. బంధువులు, మిత్రులకు ముఖం చూపించలేకపోతున్నామంటూ బాధపడుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారన్న కేసుల్లో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ.. పలువురు ప్రభుత్వాధికారులను అరెస్టు చేసింది. వారిని కోర్టు ఆదేశాల మేరకు జైళ్లకు తరలించారు. అప్పటి వరకు దర్జాగా బతికిన తామంతా ఒక్కసారిగా జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి రావడంతో ఆ అధికారులు మానసికంగా తీవ్రంగా కుంగిపోతున్నారు.
పట్టుబడిన అవినీతి అధికారుల్లో కొందరైతే జైల్లో నాలుగు గోడల మధ్య చిన్నపిల్లల మాదిరిగా గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరికొందరు మూగగా రోదిస్తున్నారు. ఇటీవల ఏసీబీకి పట్టుబడి, జైలు పాలైన ఓ పోలీసు అధికారి.. రెండు రోజులు అదేపనిగా ఏడ్చారని, మానసికంగా తీవ్రంగా కుంగిపోయారని తెలిసింది. ఆయనే కాదు అవినీతి కేసుల్లో జైలుకొచ్చిన వారిలో చాలా మంది పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జైలుకు వెళ్లిన అనుభవం ఉన్న వారి పరిస్థితి ఇందుకు కొంత భిన్నంగా ఉంటున్నట్లు సమాచారం. కొందరైతే తమను కలిసేందుకు వచ్చే వారికి ముఖం చూపించేందుకు ఇష్టపడడం లేదని తెలిసింది. భార్య, పిల్లలు, న్యాయవాదితో మాత్రమే ములాఖత్‌లో కలిసి మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఏసీబీ కేసుల్లో పట్టుబడుతున్న అవినీతి అధికారులు, సిబ్బంది కనీసం నెల రోజులకుపైగా జైల్లో విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించి బెయిల్‌కు ప్రయత్నించాల్సిన పరిస్థితి ఉంటోంది. అయితే ఇప్పుడు ఏసీబీకి పట్టుబడిన తర్వాత బాధపడి ఏం లాభం? అని.. నిజాయితీగా విధులు నిర్వర్తించి ఉంటే ఈ తిప్పలు తప్పేవి కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏసీబీ కేసా.. డోంట్‌కేర్!
మరికొందరు అధికారులైతే ఏసీబీ కేసులను లైట్‌గా తీసుకుంటున్నారు. గతంలో ఓ రవాణా శాఖ అధికారి వరంగల్, నిజామాబాద్‌లో ఏసీబీకి దొరికారు. ఆయన అలా దొరికినప్పుడల్లా ‘‘ఆ.. ఏముందిలే ఓ రూ.50 లక్షలు ఖర్చు పెట్టి మళ్లీ పోస్టింగ్‌లో చేరుతా..’’ అని చాలా లైట్‌గా తీసుకునేవారని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఆయన అలా అన్నట్లుగానే తిరిగి విధుల్లో చేరేవారు. కీలక బాధ్యతల్లో ఉండేవారు. సదరు అధికారి ఉద్యోగ విరమణకు కొద్దికాలం ముందుకూడా ఏసీబీకి చిక్కారు. ఆయన ఈసారి తిరిగి విధుల్లో చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఆయనొక్కరే కాదు కీలక విభాగాల్లో అధికారులు, సిబ్బంది పదేపదే ఏసీబీకి పట్టుబడ్డా పద్ధతి మార్చుకోవడం లేదు.
ఎఫ్ఎస్ఎల్లో స్వర నమూనా పరీక్షలు..
అవినీతి కేసుల్లో కూడా నిందితుల స్వర నమూనాలను సాంకేతికంగా విశ్లేషించి, నేరం రుజువు చేయడంపై ఏసీబీ దృష్టి సారించింది. ట్రాప్ కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు బాధితులతో బేరసారాలు, సంభాషణలు జరిపే ఆడియోలను అధికారులు కీలక ఆధారంగా మలుచుకుంటున్నారు. తమకు లభించిన ఆడియోలో ఉన్న గొంతును నిందితుడి స్వర నమూనాతో సాంకేతికంగా సరిపోల్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో పలు కీలక కేసుల్లో దర్యాప్తు అధికారులు ఎఫ్‌ఎ్‌సఎల్‌లో స్వర నమూనాల విశ్లేషణ చేపట్టారు. అదే పద్ధతిని ఇకపై ట్రాప్ కేసుల్లోనూ అనుసరించనున్నారు.
సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషణ
టెక్నాలజీ వాడకం పెరిగిన ప్రస్తుత తరుణంలో అవినీతి కేసుల్లో పట్టుబడే వారి నుంచి స్వాధీనం చేసుకునే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఇతర సాంకేతిక పరికరాలను పూర్తి స్థాయిలో విశ్లేషించడంపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఏసీబీ ప్రధాన కార్యాలయంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఆయా కేసుల్లో పట్టుబడే ప్రభుత్వ ఉద్యోగులు తమ వద్ద ఉండే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ పిన్ నంబర్లు చెప్పేందుకు నిరాకరిస్తుంటారు. అలాంటప్పుడు సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాటిని విశ్లేషించి, తొలగించిన సమాచారం రిట్రీవ్ చేయడంతోపాటు సాంకేతిక ఆధారాలు, సమాచారాన్ని సేకరిస్తున్నారు.