హైదరాబాద్ : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బుధవారం మీ-సేవ విభాగం పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులు, డిజిటల్ సేవల పురోగతిని సిఎస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆగస్టు 15 నాటికి మీ-సేవ ద్వారా అందించే సేవల పరిధిని మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 33 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక సేవలు మీ-సేవ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని సేవలను ఈ వేదికలో చేర్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుత ఆధునిక సమాచార సాంకేతికత, కృత్రిమ మేధస్సు (AI), డేటా ఆధారిత పరిష్కారాలను మీ-సేవ వ్యవస్థతో అనుసంధానించి, ఈ-గవర్నెన్స్ సేవలను ప్రజల ముంగిటకు మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వీలైనన్ని ఎక్కువ సేవలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, సమయానుకూలమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ప్రధాన కార్యదర్శి, మీ-సేవను దేశంలోనే ఆదర్శవంతమైన పౌర సేవల వేదికగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దూరిశెట్టి, మీ-సేవ డైరెక్టర్ రవికిరణ్‌తో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.