అంబర్ పేట మహంకాళి బోనాల ఉత్సవాలకువిస్తృత ఏర్పాట్లు చేయండి: ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు

హైదరాబాద్ : అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్టు 9న అంబర్ పేట్ మహంకాళి ఆలయంలో అమ్మవారి బోనాలు జరగనున్నందున ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిహెచ్ఎంసి, ట్రాన్స్ కో, పోలీస్, జలమండలి, వైద్యారోగ్యశాఖ, కల్చరల్ డిపార్ట్ మెంట్ లు సమన్వయంతో విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ బోనాలకు అధికసంఖ్యలో భక్తులు పాల్గొంటున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రజలు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని, తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ ఏడాది ఆషాఢ జాతర ఉత్సవాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.
ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా భారీ రద్దీ ఉండే దేవాలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయశాఖ పై, దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రధ్దతో ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించినందుకు సీఎంకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు బల్మూర్ వెంకట్, ఎస్ పిడిసిఎల్ ఎం.డి.జితేష్ వి.పాటిల్,సమాచార,పౌర సంబంధాలశాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్, వాటర్ వర్క్స్ జిఎం, ఆర్ టిసి ఇడి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.