
చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ(సీపెట్)లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంగళవారం సర్టిఫికెట్లు, టూల్‌కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కోర్సులలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షనీయమని ఎన్‌ఎస్‌ఐసీ జనరల్ మేనేజర్ ప్రభురాజ్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ, జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ పథకాల ద్వారా నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సీపెట్ చీఫ్ మేనేజర్ ఏవీఆర్.కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో విద్యార్థులకు పలు రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు హాస్టల్, భోజన వసతి కల్పిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపెట్ ప్రతినిధులు విజయ్‌కుమార్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.