ఆయిల్ పామ్ విస్తరణలో అలసత్వం సహించం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • లక్ష్య సాధనలో విఫలమైన కంపెనీలపై కఠిన చర్యలు తప్పవు
  • ఇప్పటికే కంపెనీలకు పలుమార్లు నోటిసులు
  • పురోగతి లేని కంపెనీలను తొలగించడానికైనా ప్రభుత్వం సిద్ధం.
  • 85 వేల ఎకరాల లక్ష్యంలో ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాలే.. కంపెనీల పనితీరుపై మంత్రి తీవ్ర అసంతృప్తి
  • రైతులు ముందుకొస్తుంటే కంపెనీలు వెనుకబడటం ఆమోదయోగ్యం కాదు
  • మొక్కల కొరతకు అవకాశం ఇవ్వొద్దు.. అవసరమైతే ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేయాలి
  • ఆయిల్ ఫెడ్‌కూ మినహాయింపు లేదు.. పనితీరు లేకుంటే జిల్లాలు తగ్గిస్తాం
  • నిర్మాణంలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్లు వేగంగా పూర్తి చేయాలి
  • ప్రతి రైతుకు సకాలంలో మొక్కలు, క్షేత్రస్థాయిలో సాంకేతిక సహాయం అందాలి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగు విస్తరణ కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తావులేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో విఫలమవుతున్న ఆయిల్ పామ్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్‌ను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్, ఆయిల్ ఫెడ్ ఎండి యాస్మిన్ బాషా, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 85 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు కేవలం 17,090 ఎకరాలలో మాత్రమే సాగు నమోదైందని, అంటే లక్ష్యంలో సుమారు 20 శాతం మాత్రమే పురోగతి సాధించడంపై అత్యంత నిరాశ కలిగించే విషయమని అన్నారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కంపెనీలలో ఆశించిన స్థాయిలో చిత్తశుద్ధి కనిపించడం లేదని తీవ్ర
అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలుమార్లు కంపెనీలతో సమావేశాలు నిర్వహించి, ఆయిల్ పామ్ విస్తరణను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కంపెనీల పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడంలేదని మంత్రి అన్నారు. రైతులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న సమయంలో కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

పలుమార్లు నోటీసులు ఇచ్చినా తీరు మారని కంపెనీలు
పనితీరు సరిగా లేని కంపెనీలకు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లోహియా కంపెనీకి, గద్వాల, నారాయణపేట, జనగామ జిల్లాలలో పనిచేస్తున్న ఆయిల్ ఫెడ్‌కు నాలుగు సార్లు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్న తిరుమల కంపెనీకి, భూపాలపల్లి, ములుగు, వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రియూనిక్ కంపెనీకి, హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పనిచేస్తున్న రామ్ చరణ్ కంపెనీకి మూడు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గోద్రెజ్ కంపెనీకి రెండు సార్లు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే విశ్వతేజ్ కంపెనీకి ఐదు సార్లు, కేన్ బయో కంపెనీకి ఆరు సార్లు, పతంజలి కంపెనీకి ఆరు సార్లు, మాట్రిక్స్ కంపెనీకి ఐదు సార్లు, సువేన్ ఆగ్రో కంపెనీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కంపెనీలలో ఆశించిన మార్పు కనిపించలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనితీరు లేకుంటే జిల్లాల పరిధి తగ్గింపు
పతంజలి, లోహియా, కేన్ బయో, మాట్రిక్స్ కంపెనీల పరిధిలోని కొన్ని జిల్లాలను గతంలోనే తొలగించి ఇతర కంపెనీలకు అప్పగించినప్పటికీ, కంపెనీలు ఇంకా బాధ్యతాయుతమైన వైఖరి కనిపించడంలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్య సాధనలో వెనుకబడిన ఏ కంపెనీ అయినా వారి పరిధిలోని జిల్లాలను తగ్గించడానికైనా లేక పూర్తిగా తొలగించడానికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడదని, అలాగే మెరుగైన పనితీరు కనబరిచే కంపెనీలకు మరికొన్ని జిల్లాలను అప్పగించే ఆలోచనకు ప్రభుత్వం సిద్ధం ఉందని అన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్‌కు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని, పనుల్లో పురోగతి లేకుంటే ఆ సంస్థ పరిధిలోని జిల్లాలను కూడా ఇతర సంస్థలకు లేక కొత్త సంస్థలకు అప్పగించే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మొక్కల కొరత ఉండకూడదు
సమావేశంలో మొక్కల లభ్యతపై కూడా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ఆగస్టు నెలలో మొక్కల కొరత ఎదురయ్యే అవకాశం ఉన్న కంపెనీలు ముందస్తుగా ఇతర కంపెనీల నుంచి మొక్కలను కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతు మొక్కలు కోరిన వెంటనే అందించే స్థాయిలో ప్రతి కంపెనీ సిద్ధంగా ఉండాలని సూచించారు. మొక్కల లభ్యత పేరుతో ఒక్క రైతు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు.

రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తి సహకారం అందించాలి
కంపెనీల ఫీల్డ్ సిబ్బంది గ్రామ స్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఆయిల్ పామ్ సాగు యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, పంట సంరక్షణ తదితర అంశాలపై రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తూ, వారి సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని కంపెనీల ప్రతినిధులకు సూచించారు.

ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం వేగవంతం చేయాలి
యూనిట్ల ఏర్పాటులో జాప్యం కూడా ప్రభుత్వం సహించదని, ఇప్పటికే కావాల్సింత సమయం కంపెనీలకు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. యూనిట్లు త్వరగా అందుబాటులోకి వస్తే రైతులకు రవాణా భారం తగ్గడంతో పాటు పంటకు సకాలంలో ప్రాసెసింగ్ సౌకర్యం లభిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, రైతులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కంపెనీలకు సూచించారు.