ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణికి కొత్త ఊపిరి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

  • వేలంలో మ‌ణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్ సింగ‌రేణికి ద‌క్క‌డం చారిత్ర‌క విజ‌యం
  • మొన్న నైనీ ప్రారంభించాం, నిన్న తాడిచ‌ర్ల‌-2 బ్లాక్ కు మైనింగ్ లీజు సంపాదించాం
  • నేడు మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్‌ను సింగ‌రేణికి ద‌క్కేలా చూశాం
  • నెల వ్య‌వ‌ధిలో సింగ‌రేణికి రెండు చారిత్ర‌క విజ‌యాలు న‌మోదు
  • మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్‌ నుంచి ఏటా 6 మిలియ‌న్ల చొప్పున 20 ఏళ్లు 120 మిలియ‌న్ ట‌న్నుల జీ-8 నాణ్య‌మైన బొగ్గు వెలికితీత‌కు అవ‌కాశం
  • 2 వేల మంది ఉపాధికి భ‌ద్ర‌త‌.. మ‌ణుగూరు ఏరియాకు మ‌రో 20 ఏళ్ల భ‌రోసా
  • సింగ‌రేణి భ‌విష్య‌త్‌, తెలంగాణ ఇంధ‌న భ‌ద్ర‌తే మా ప్రాధాన్య అంశాలు
  • కోయ‌గూడెం-3, స‌త్తుప‌ల్లి-3 బ్లాక్ ల‌ను సాధించ‌డ‌మే త‌దుప‌రి ల‌క్ష్యం
  • సింగ‌రేణి మ‌రింతగా విస్త‌రించేలా పూర్తి స‌హ‌కారం
  • ప్రజా ప్రభుత్వ కృషితో మరో విజయగాథ
  • తొలిసారిగా వేలంలో పాల్గొని మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను సింగ‌రేణి ద‌క్కించుకోవ‌డంపై అమెరికా నుంచి రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

ప్ర‌జా ప్ర‌భుత్వంలో సింగ‌రేణి ప‌రిర‌క్ష‌ణ‌, విస్త‌ర‌ణ‌తోపాటు రాష్ట్ర ఇంధ‌న భ‌ద్ర‌త‌ను సుస్థిరం చేయాల‌న్న సంక‌ల్పంతో గ‌త 30 నెల‌లుగా అవిశ్రాంతంగా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తూ సింగ‌రేణికి కొత్త ఊపిరి ల‌భిస్తోంద‌ని, ఈ రోజు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వ‌హించిన ఆన్‌లైన్ వేలంలో మ‌ణుగూరు ఏరియా అస్తిత్వానికి అతి కీల‌క‌మైన పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ సింగ‌రేణికి ద‌క్క‌డం చారిత్ర‌క విజ‌యంగా రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, ఇంధ‌న శాఖ మంత్రి భ‌ట్టి విక్రమార్క అభివర్ణించారు. తెలంగాణ ప్రజల ఆస్తి అయిన సింగరేణిని కాపాడుకోవ‌డానికి కొత్త బ్లాక్‌ల‌ను ద‌క్కించుకోవాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నాలు.. సింగ‌రేణికి అందిస్తున్న స‌హ‌కారం వ‌ల్లే ఈ రోజు ఈ విజ‌యం సాధ్య‌మైంద‌న్నారు. అస‌లు ప్రారంభం అవుతుందా లేదా తెలియ‌ని స్థితిలో ఉన్న ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు అనుమ‌తులు సాధించేందుకు తానే ఒడిశాకు వెళ్లి అక్క‌డి ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను, ప్ర‌జ‌ల‌ను క‌లిసి ఒప్పించాన‌ని, ఫ‌లితంగా ఈ రోజు 36 ఏళ్ల పాటు సంస్థ‌కు బ‌ల‌మైన పునాది వేసే నైనీలో బొగ్గు ఉత్ప‌త్తి జ‌రుగుతోంద‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో 2013 లో యూపీఏ హ‌యాంలో మైనింగ్ అనుమ‌తులు జారీ చేసిన తాడిచ‌ర్ల -2 బొగ్గు బ్లాక్‌ను గ‌త బీఆర్ఎస్ పాల‌కులు విస్మ‌రిస్తే తాము అధికారంలోకి వ‌చ్చాక కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రిపి గ‌త నెల రెండో వారంలో మైనింగ్ లీజులు జారీ చేయించామ‌ని తెలిపారు. ఈ గ‌ని ద్వారా 336 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గు నిక్షేపాల‌ను 45 ఏళ్ల పాటు వెలికితీయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

తాజాగా ఈరోజు (సోమవారం) కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వ‌హించిన వేలంలో సింగ‌రేణి పాల్గొని మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ ను ద‌క్కించుకుంద‌ని, గ‌త పాల‌కులు సింగ‌రేణి సంస్థ‌ను వేలంలో పాల్గొన‌కుండా నిరోధించి మ‌న రాష్ట్రంలోని విలువైన బొగ్గు బ్లాక్‌ల‌ను వారి అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టే కుట్ర‌లు చేశార‌ని, తాము సింగ‌రేణి మ‌నుగడ కోసం వేలంలో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వ‌డం వ‌ల్లే ఈ రోజు సింగ‌రేణికి దాదాపు 12 ఏళ్ల త‌ర్వాత వేలంలో ఒక బ్లాక్ ద‌క్కింద‌ని తెలిపారు. ఇది ఇందిర‌మ్మ ప్ర‌జా ప్ర‌భుత్వంలో న‌మోదైన ప్ర‌జా విజ‌యంగా అభివ‌ర్ణించారు. గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో సింగ‌రేణిలో న‌మోదైన రెండో అతి పెద్ద విజ‌యంగా పేర్కొన్నారు. మ‌ణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ గ‌నితో 120 మిలియ‌న్ ట‌న్నుల నాణ్య‌మైన జీ-8 గ్రేడ్‌ బొగ్గును వెలికితీయొచ్చ‌ని, ఏటా 6 మిలియ‌న్ ట‌న్నుల చొప్పున 20 ఏళ్ల పాటు బొగ్గును మ‌న విద్యుత్ అవ‌స‌రాల‌కు వినియోగించుకోవ‌చ్చ‌న్నారు. మరీ ముఖ్యంగా, సింగరేణిలో అత్యంత కీలకమైన ఏరియాల్లో ఒకటైన మణుగూరు ఏరియా అస్తిత్వాన్ని పరిరక్షించడంలో ఈ బ్లాక్ కీలక పాత్ర పోషించనుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 2 వేల మందికి పైగా కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి భద్రత లభించడమే కాకుండా, మణుగూరు ప్రాంత ఆర్థికాభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే, ఈ బ్లాక్‌లోని నాణ్యమైన బొగ్గు నిల్వల ద్వారా రాబోయే 20 సంవత్సరాల పాటు తెలంగాణ విద్యుత్ అవసరాలకు అవసరమైన బొగ్గు సరఫరా చేయడంతో రాష్ట్ర ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో సింగరేణి ప్రయోజనాల పరిరక్షణలో తగిన చొరవ చూపకపోవడం వల్ల కోయగూడెం-3 మరియు సత్తుపల్లి–3 వంటి కీలక బొగ్గు బ్లాక్‌లు ప్రైవేట్ సంస్థలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజా ప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాలనే కేంద్రబిందువుగా తీసుకుని ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మణుగూరు పీకే ఓసీ-2 డిప్ సైడ్ బ్లాక్ ద‌క్క‌డంపై సింగ‌రేణి యాజ‌మాన్యానికి, కార్మిక సంఘాల నాయ‌కులకు, కార్మికులంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు. రానున్న రోజుల్లో గ‌తంలో ప్రైవేట్ ప‌ర‌మైన కోయ‌గూడెం -3 బ్లాక్‌, స‌త్తుప‌ల్లి -3 బ్లాక్‌ల ను కూడా సింగ‌రేణికి ద‌క్కేలా ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కేవ‌లం మ‌న రాష్ట్రానికే ప‌రిమితం కాకుండా ఇత‌ర రాష్ట్రాల్లోనూ బొగ్గు గ‌నుల‌ సాధ‌న‌, ఇత‌ర క్రిటిక‌ల్ మిన‌ర‌ల్స్ అన్వేష‌ణ‌లోనూ సింగ‌రేణి విస్త‌రించడానికి కార్యచరణ ప్రణాళికను రూపొందించుకొని ముందుకు వెళుతున్నదని తెలిపారు.