హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సచివాలయ ఆవరణలోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన పూజల్లో ప్రధాన కార్యదర్శి పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పుల వాయిద్యాలు, వివిధ వేషధారణలతో కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉత్సవాల్లో పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో సుభిక్షం, శాంతి, అభివృద్ధి నెలకొనాలని ఆకాంక్షించారు.
