- ఆగస్టు 10న నాగార్జునసాగర్ వద్ద వైభవంగా నిర్వహణ
- ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పంతో రాష్ట్ర శ్రేయస్సు కోసం మహాక్రతువు
- పూర్ణాహుతికి ముఖ్యమంత్రి హాజరు
హైదరాబాద్ : ప్రకృతి అనుగ్రహమే ప్రజల సంక్షేమానికి, రైతాంగ సౌభాగ్యానికి, రాష్ట్ర సమృద్ధికి శాశ్వత ఆధారం. మేఘాలు కరుణిస్తే నేల పులకిస్తుంది… నేల పులకిస్తే పంటలు పుష్కలంగా పండుతాయి… రైతు ఆనందమే రాష్ట్ర అభ్యున్నతికి నిజమైన కొలమానం. ఈ మహోన్నత సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మహా వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించారని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, కృష్ణా–గోదావరి మహానదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, రిజర్వాయర్లు, చెరువులు సంపూర్ణంగా నిండిపోవాలని, ఎల్‌నినో వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తెలంగాణపై లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, సిద్ధాంతులు, వేదపండితులు ఆగస్టు 10వ తేదీని శుభముహూర్తంగా నిర్ణయించారని తెలిపారు.
కృష్ణానది పవిత్ర తీరాన వెలసిన నాగార్జునసాగర్ జలాశయం విజయవిహార్ ప్రాంగణంలో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలు, వేదఘోషల మధ్య అత్యంత వైభవోపేతంగా మహా వరుణయాగం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వేదవేత్తలు, అర్చక బృందం సమక్షంలో రాష్ట్ర సుభిక్షం, రైతాంగ సంక్షేమం, ప్రజల ఆయురారోగ్యాలు, పశుసంపద అభివృద్ధి, ప్రకృతి సమతుల్యత కోసం ప్రత్యేక వేదక్రతువులు నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 3.24 గంటలకు జరిగే మహా పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచ్చేసి పాల్గొని రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రకృతి పట్ల భారతీయ సంస్కృతి చూపిన గౌరవానికి, వేద సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ మహోన్నత వరుణయాగంలో ప్రజలు, రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. “వర్షం అనేది కేవలం నీటి చుక్క కాదని… అది రైతు ఆశ, భూమి ఊపిరి, తెలంగాణ భవిష్యత్ అని ఆయన అభివర్ణించారు. ప్రకృతి ప్రసన్నమైతే ప్రజల జీవితం పరిపూర్ణమవుతుందని, ఆ దివ్య సంకల్పానికే ఈ మహా వరుణయాగం ప్రతీకగా నిలుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్బోధించారు.