హైదరాబాద్: మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయారు చేసే గమ్యం వైపు తెలంగాణ అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రాయదుర్గంలోని టీ–వర్క్స్ ప్రాంగణంలో శనివారం జరిగిన ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్–అవార్డ్స్ 2026 కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. క్వాలిటీ థాట్ ఫ్యూచర్ స్కిల్స్ ఫౌండేషన్ పరిశ్రమ, విద్యాసంస్థలు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా అన్నారు.
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల నుంచి ఏటా 2 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని శ్రీధర్‌బాబు తెలిపారు. వారికి డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీ ఒక్కటే సరిపోదన్నారు. “పరిశ్రమకు నైపుణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే శక్తి, నిరంతరం నేర్చుకునే తత్వం అవసరం” అని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలోని యువ జనాభాను అతిపెద్ద వనరుగా గుర్తించామని మంత్రి చెప్పారు. వీరంతా నైపుణ్యాలతో కూడిన మానవ వనరుగా మారినప్పుడే అది నిజమైన డెమోగ్రాఫిక్ డివిడెండ్‌గా మారుతుందన్నారు. “మా లక్ష్యం కేవలం విద్య అందించడం కాదు.. ఉపాధి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి, ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అవసరమైన విద్యను అందించడం” అని తెలిపారు. పాతకాలం నాటి ఐటీఐ కోర్సులను ఆధునిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారుస్తున్నామని చెప్పారు. 65 ప్రభుత్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
“దశాబ్దాల క్రితం రూపొందించిన ఐటీఐ కోర్సులు అప్పటి పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండేవి. ఇప్పుడు తయారీ రంగంలో రోబోటిక్స్, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, డిజిటల్ టెక్నాలజీలు అవసరం. మన ఐటీఐలు నిన్నటి పరిశ్రమ కోసం కాదు.. రేపటి ఫ్యాక్టరీల కోసం యువతను సిద్ధం చేయాలి” అని స్పష్టం చేశారు. టాటా సన్స్ సహకారంతో రూ.2,400 కోట్లో ఈ కేంద్రాలను భవిష్యత్తు పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. ఇప్పటి పరిశ్రమల్లో మొదటి రోజు నుంచే పనిచేయగల నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లను తయారు చేయడమే లక్ష్యమన్నారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశంలో నైపుణ్యాభివృద్ధికి కొత్త నమూనాగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. “విద్య ఉపాధికి దారితీయాలి. కోర్సుల రూపకల్పనలో పరిశ్రమకు మరింత బలమైన పాత్ర ఉండాలి. ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా ఉంటుంది.. పరిశ్రమే నైపుణ్యాల వ్యవస్థలో కేంద్రంగా ఉండాలి” అని అన్నారు. ఆనంద్ మహీంద్రా చైర్మన్‌గా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో యూనివర్సిటీ పనిచేస్తోందని తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులు, ప్రాక్టికల్ శిక్షణ, పరిశ్రమల్లో అనుభవం కల్పించడమే లక్ష్యమన్నారు. “ప్రతి విద్యార్థి డిగ్రీతోపాటు కనీసం ఒక పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించాలి” అని శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ మార్కెటింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పొందాలని సూచించారు.
“టెక్నాలజీ మారుతోంది.. పరిశ్రమలు మారతాయి.. కానీ నేర్చుకోవాలన్న తపన మాత్రం మారకూడదు. డిగ్రీతో చదువు ముగియదు.. జీవితాంతం నేర్చుకోవడం కొత్త ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరి” అని చెప్పారు. కృత్రిమ మేధ (ఏఐ) ఐటీ రంగానికే పరిమితం కాకుండా వైద్యం, తయారీ, ఆర్థిక రంగం, విద్య, వ్యవసాయం తదితర దాదాపు అన్ని రంగాలను మారుస్తోందని మంత్రి తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మారతాయని, అదే సమయంలో కొత్త వృత్తులు, కొత్త పరిశ్రమలు, కొత్త అవకాశాలు భారీగా వస్తాయని చెప్పారు. ఏఐ, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీలు భవిష్యత్ సాంకేతిక విప్లవానికి కీలకంగా మారనున్నాయని తెలిపారు.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సుమారు 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 10 వేల మంది విద్యార్థులకు పరిశ్రమల సహకారంతో శిక్షణ అందిస్తున్నామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకు ఉద్యోగావకాశాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. “శిక్షణ ఇవ్వడమే కాదు.. నేరుగా ఉపాధితో అనుసంధానించడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. 2006లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పుడు భారీ పెట్టుబడిపై విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. “ఆ రోజు ఇంత పెద్ద పెట్టుబడి ఎందుకని ప్రశ్నించారు. కానీ నేడు ఓఆర్‌ఆర్ హైదరాబాద్ అభివృద్ధికి లైఫ్‌లైన్‌గా మారింది” అని చెప్పారు. అదేవిధంగా గ్రామాలకు విస్తరిస్తున్న డిజిటల్ మౌలిక వసతులు భవిష్యత్‌లో తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారతాయని తెలిపారు.
గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ, టియర్–2, టియర్–3 పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో యువత తమ స్వస్థలాల నుంచే చదువు, ఉద్యోగం, వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నామని తెలిపారు. నైపుణ్యాల అంతరాన్ని ప్రభుత్వం ఒక్కటే పూడ్చలేదని, పరిశ్రమలు విద్యా వ్యవస్థలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు కోర్సుల రూపకల్పనలో భాగస్వాములు కావడం, ఇంటర్న్‌షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, మెంటరింగ్ అందించడం ద్వారా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాలని సూచించారు. “క్లాస్‌రూమ్, వర్క్‌ప్లేస్ రెండు వేర్వేరు ప్రపంచాలుగా ఉండకూడదు.. అవి పరస్పరం అనుసంధానమై ఉండాలి” అని అన్నారు. “నేర్చుకోండి.. మార్పుకు అనుగుణంగా మారండి.. ఆవిష్కరించండి.. కలిసి పనిచేయండి.. మీ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోండి” అని సూచించారు. ప్రతి విద్యార్థి కళాశాల నుంచి కేవలం డిగ్రీతో బయటకు రాకుండా నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ప్రాక్టికల్ అనుభవం, విలువ సృష్టించే సామర్థ్యంతో బయటకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ నిర్వాహకులు రమణ, క్రిష్, టీ–వర్క్స్ సీఈవో జోగిందర్ తణికెళ్ల, టాస్క్ సీఈవో నితిన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.