అడవితో అనుబంధం.. అభివృద్ధిలో అగ్రస్థానం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • గిరిజన ఆదివాసి బిడ్డలకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
  • గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్ల కేటాయింపు
  • అడవిని కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధి చెందాలి

హైదరాబాద్ : అడవితో అనుబంధాన్ని, తమ మూలాలను కాపాడుకుంటూనే గిరిజన సమాజం అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆకాంక్షించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, మహిళా సాధికారతతో పాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. గిరిజన బిడ్డలు దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో రాణించేలా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

గిరిజన సంక్షేమానికి రూ.18,745.16 కోట్లు
2026–27 ఆర్థిక సంవత్సరానికి ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.18,745.16 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ నిధులను గిరిజన ప్రాంతాల్లో విద్య, మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, విద్యుత్, సాగు–భూమి అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. “ఒక గిరిజన గ్రామానికి రోడ్డు రావాలి.. ఒక ఇంటికి మంచినీరు అందాలి.. ఒక విద్యార్థికి మంచి విద్య లభించాలి.. ఒక యువకుడికి నైపుణ్యం రావాలి.. ఒక మహిళకు ఆదాయం సమకూరాలి.. ఒక రైతు భూమిలో పంట పండాలి. అప్పుడే బడ్జెట్‌కు నిజమైన అర్థం ఉంటుంది” అని మంత్రి పేర్కొన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో దూరం అనే మాట ఉండకూడదు
గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం ప్రతి గిరిజన కుటుంబానికి అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి అంటే నగరాల్లో పెద్ద భవనాలు నిర్మించడం మాత్రమే కాదని.. మారుమూల గిరిజన తండాలో ఒక కుటుంబం జీవితం సులభతరం చేయడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.

భూమికి నీరు.. రైతుకు పంట.. కుటుంబానికి ఆదాయం
ఇందిరా గిరి జల వికాసం ద్వారా గిరిజన రైతుల భూములకు నీటి వసతి కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి తెలిపారు. సౌరశక్తి, సోలార్ పంపుల వినియోగాన్ని పెంచడంతో పాటు తోటలు, ప్రత్యామ్నాయ పంటలు, భూమి ఉత్పాదకత పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అడవి.. ఆదివాసీకి తల్లి లాంటిది
ఆదివాసీకి అడవి కేవలం ప్రకృతి సంపద కాదని.. అది జీవనాధారం, సంస్కృతికి మూలం, భవిష్యత్తుకు భరోసా అని మంత్రి అన్నారు. అడవి అన్నం, ఔషధం, ఉపాధి, నీడ అందించిందని తెలిపారు. “ఆదివాసీ–అడవి బంధం చెట్టు–మనిషి సంబంధం కాదు.. తల్లి–బిడ్డ అనుబంధం” అని పేర్కొన్నారు. అడవిని కాపాడుకుంటూనే అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

అడవి నుంచి ఐఐటీ వరకు.. గిరిజన బిడ్డల విజయ ప్రస్థానం
గిరిజన గురుకులాల్లోని 166 విద్యాసంస్థల్లో 83 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. 2025–26లో పదో తరగతిలో 98 శాతానికి పైగా, ఇంటర్మీడియట్‌లో 86 శాతానికి పైగా, డిగ్రీలో 89 శాతానికి పైగా ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. 28 మంది ఐఐటీల్లో, 23 మంది ఎన్‌ఐటీల్లో ప్రవేశాలు పొందగా, 167 మంది నీట్‌లో అర్హత సాధించడం గిరిజన విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమన్నారు. అవకాశాలు కల్పిస్తే గిరిజన బిడ్డలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లగలరని అన్నారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో రాణించేలా ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

పుస్తకంతో పాటు.. ఏఐ విద్య
ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కొత్త ఉద్యోగ అవకాశాలపై గిరిజన విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ ఆధారిత ఎస్‌టీఈఎం ల్యాబ్‌లు, డిజిటల్‌ లెర్నింగ్‌, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. గిరిజన బిడ్డలు డాక్టర్, ఇంజినీర్, శాస్త్రవేత్త, అధికారి, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి గిరిజన యువత ఎదగాలని పిలుపునిచ్చారు.

అటవీ ఉత్పత్తులకు విలువ జోడించాలి
తేనె, చింతపండు, ఔషధ మొక్కలు తదితర అటవీ ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా గిరిజనులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముడి ఉత్పత్తులను తక్కువ ధరకు విక్రయించకుండా ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ ద్వారా గిరిజన యువత, మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

గిరిజన మహిళ ఆర్థికంగా బలపడాలి
గిరిజన మహిళ కుటుంబం, వ్యవసాయం, అడవిపై ఆధారపడి నిరంతరం శ్రమిస్తోందని మంత్రి అన్నారు. ఆమె శ్రమకు తగిన విలువ, ఆదాయం లభించేలా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. “మహిళ ఆర్థికంగా బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే గిరిజన సమాజం బలపడుతుంది” అని పేర్కొన్నారు.

పీఎం-జన్మన్‌ అమలులో తెలంగాణకు మూడో స్థానం
ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన కుటుంబాల సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పీఎం-జన్మన్‌ కార్యక్రమంలో తెలంగాణ దేశంలో మూడో ఉత్తమ రాష్ట్రంగా నిలవడం గర్వకారణమని మంత్రి తెలిపారు. ఇళ్లు, తాగునీరు, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు ప్రతి అర్హమైన గిరిజన కుటుంబానికి అందేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ర్యాంకుల కంటే ఒక గిరిజన తల్లి “నా ఇంటికి నీళ్లు వచ్చాయి” అని చెప్పడం, ఒక రైతు “నా భూమికి నీరు వచ్చింది” అని చెప్పడం, ఒక విద్యార్థి “నాకు మంచి చదువు దొరికింది” అని చెప్పడమే ప్రభుత్వానికి అసలైన అవార్డు అని అన్నారు.

మన భాష.. మన చరిత్ర.. మన సంస్కృతి
గిరిజన భాషలు కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కావని.. తరతరాలుగా వచ్చిన అటవీ జ్ఞానం, ఔషధ పరిజ్ఞానం, జీవన విధానం, చరిత్ర, సంస్కృతి వాటిలో నిక్షిప్తమై ఉన్నాయని మంత్రి అడ్లూరి తెలిపారు. గిరిజన భాషలు, జానపద కళలు, పాటలు, నృత్యాలు, సంప్రదాయ జ్ఞానాన్ని భావితరాలకు అందించేందుకు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు. “ఇంగ్లిష్‌ నేర్చుకోవాలి.. తెలుగు నేర్చుకోవాలి.. ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి.. కానీ మన ఇంట్లో అమ్మమ్మ మాట్లాడే భాషను మాత్రం మర్చిపోవద్దు” అని గిరిజన విద్యార్థులకు సూచించారు.

రాంజీ గోండ్‌ త్యాగాలు భావితరాలకు స్ఫూర్తి
గిరిజన ఆదివాసీల వీరుల చరిత్రను పుస్తకాలకే పరిమితం చేయకుండా భావితరాలకు తెలియజేయాలని మంత్రి అన్నారు. రాంజీ గోండ్‌ వంటి వీరుల త్యాగాలను ప్రతి గిరిజన విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న రాంజీ గోండ్ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం భవిష్యత్ తరాలకు గిరిజన చరిత్ర, పోరాట స్ఫూర్తిని పరిచయం చేసే కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు.

ఇందిరాగాంధీ గిరిజన సంక్షేమానికి బలమైన పునాది
మాజీ ప్రధాని దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ గిరిజనుల హక్కులు, గౌరవం, అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. గిరిజనుల రాజ్యాంగపరమైన రక్షణలు, రిజర్వేషన్లు, ప్రత్యేక అభివృద్ధి విధానాలకు బలమైన పునాది ఏర్పడిందన్నారు. అటవీ హక్కుల చట్టం గిరిజనుల భూమి, అటవీ హక్కులకు చారిత్రక గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గిరిజనుల హక్కులను కాగితాలకే పరిమితం చేయకుండా కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తోందన్నారు.

ప్రభుత్వంతో పాటు సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి
గిరిజన సమాజ అభివృద్ధిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రతి కుటుంబం భాగస్వామి కావాలని మంత్రి పిలుపునిచ్చారు. పిల్లలను తప్పనిసరిగా బడికి పంపాలని, బాల్య వివాహాలను అరికట్టాలని, మద్యపానం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువత నైపుణ్యాలు నేర్చుకోవాలని, మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని, అడవిని కాపాడాలని, చెట్లను పెంచాలని సూచించారు.

కొత్త ఆదివాసీ తెలంగాణ నిర్మాణమే లక్ష్యం
ప్రతి గిరిజన గ్రామంలో రహదారి, విద్యుత్, మంచినీరు, మంచి పాఠశాల, ఆరోగ్య సదుపాయం, ఇంటర్నెట్, యువతకు నైపుణ్య కేంద్రం, మహిళలకు ఉపాధి, రైతులకు సాగునీరు అందుబాటులో ఉండాలని మంత్రి అన్నారు. అదే సమయంలో మన పాట, మన నృత్యం, మన భాష, మన పండుగ, మన అడవి, మన గౌరవం కూడా నిలిచి ఉండాలని ఆకాంక్షించారు. “మన అడవిని కాపాడుదాం.. మన భూమిని కాపాడుదాం.. మన భాషను, మన సంస్కృతిని, మన హక్కులను కాపాడుదాం. అన్నింటికంటే ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తును కాపాడుదాం” అని పిలుపునిచ్చారు. “అడవిని కాపాడుదాం–ఆదివాసీని బలపరుదాం.. ఆదివాసీని బలపరుదాం–తెలంగాణను బలపరుదాం” అని మంత్రి అన్నారు.


గిరిజన హక్కులు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ సంతోష్ బి.ఎం., ఐఏఎస్ మాట్లాడుతూ.. గిరిజనుల అటవీ హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, ఆరోగ్యం, మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి, సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణకు శాఖ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గిరిజనుల సాంప్రదాయ జ్ఞానం, జీవన విధానం, కళలు, భాషలు, ఆచారాలను భావితరాలకు అందించేందుకు టీఆర్‌ఐ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

గిరిజనులకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి
మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన జనాభా ప్రాతిపదికన కనీసం ఒక శాసనసభ స్థానం కల్పించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో లంబాడీలకు కల్పించిన రిజర్వేషన్లతో విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు తదితర రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించారని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు గిరిజనేతరుల అక్రమ ప్రవేశం, భూముల ఆక్రమణ వంటి అంశాలపై కఠిన నియంత్రణ అవసరమన్నారు. మాజీ ట్రైకార్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ .గిరిజన సమాజం తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కళలు, భాషలు, జీవన విధానాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ….. గిరిజన సమాజంలో విద్య ద్వారానే శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

TGTWREIS సెక్రటరీ శ్రీమతి సీతాలక్ష్మి మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఇతర విద్యాసంస్థల్లో కూడా నిర్వహించి విద్యార్థులకు గిరిజన చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన విద్యార్థులు ఆధునిక సాంకేతిక రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవాన్ని కొత్త సంకల్పానికి ప్రారంభదినంగా భావించాలని అన్నారు. వచ్చే ఏడాది సాధించాల్సిన లక్ష్యాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని, అర్హులైన గిరిజన కుటుంబాలకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.

తొమ్మిది మంది ప్రముఖులకు సన్మానం
ఆదివాసీ సమాజం, గిరిజన సంక్షేమం, విద్య, సంస్కృతి, హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తొమ్మిది మంది ప్రముఖులు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సన్మానితుల్లో మెస్రం మనోహర్, మర్సుకోల కళావతి, కాట్రాజు సైదమ్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనలు వివిధ కళా సంస్కృతులు సంబంధించిన ప్రదర్శనలు ఆటపాటలు , నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి, ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల, మ్యూజియం క్యురేటర్ డా. డి. సత్యనారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ ఎం. బాలు, ట్రైకార్ జి.ఎం. శంకర్ రావు, GM GCC ప్రతాప్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ఉద్యోగులు, వివిధ గిరిజన సమాజాల ప్రతినిధులు పాల్గొన్నారు.