హైదరాబాద్ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ వేడుక అత్యంత వైభవంగా, చారిత్రాత్మక రీతిలో జరిగింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్మరణలో, ఉద్యమకారుల సమక్షంలో ప్రభుత్వ లాంఛనాలతో మువ్వన్నెల జెండాను ఎగురవేయడం ఒక అరుదైన మరియు భావోద్వేగ ఘట్టంగా నిలిచింది. ఈ విశిష్ట కార్యక్రమానికి కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే), ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైర్మన్ డాక్టర్ కేకే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అమరుల సాక్షిగా ఉద్యమకారుల ఆత్మగౌరవ వందనం — నేతల ప్రసంగం:
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో పాటు, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరుల ఆశయాలను స్మరించుకోవడానికే అమరదీపం వేదికగా ఈ పతాకావిష్కరణను నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం గుర్తింపు కమిటీని ఏర్పాటు చేసి, అమరదీపం వేదికగా పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కమిటీ నేతలు, ఉద్యమకారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రేవంత్ అన్న ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిజమైన ఉద్యమకారుడికి తగిన ఆత్మగౌరవం, సంక్షేమం దక్కుతుందని వారు పునరుద్ఘాటించారు.
ఘనంగా మోతె శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలు: జాతీయ పతాకావిష్కరణ అనంతరం, ఉద్యమ నేత మరియు కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి జన్మదిన వేడుకలను అక్కడికి తరలివచ్చిన ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కేకే, ప్రొఫెసర్ కోదండరామ్, ఎస్. రాములు నాయక్ శోభన్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న నిరంతర కృషిని నేతలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, కవులు మరియు కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.