- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభం
- ప్రారంభోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్: సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా. ఎంసీఆర్ టిమ్స్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం పరిశీలించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డా. ఎంసీఆర్ టిమ్స్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు, ఇతర అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమ వేదిక, ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ, ప్రజల రాకపోకలు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులను మంత్రి ఆదేశించారు. వాహనాల పార్కింగ్, అతిథులు, ప్రజాప్రతినిధుల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, బందోబస్తు, క్రౌడ్ మేనేజ్మెంట్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా హాస్పిటల్ పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. “డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవం తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి” అని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డా. ఎంసీఆర్ టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఐ&పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.