పార్కుల‌ను కాపాడి లేఔట్‌కు ప్రాణం పోయిండి

  • ర‌హ‌దారుల్లో ఆటంకాలు తొల‌గించాలంటూ విన్న‌పం
  • హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు

లే ఔట్‌ల‌లోని ర‌హ‌దారుల‌ను, పార్కుల‌ను క‌బ్జా చేసేస్తున్నారు. ప‌క్క కాల‌నీల‌కు దారులు లేకుండా గోడ‌లు క‌డుతున్నారు. ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం పెద్ద అంబ‌ర్పేట గ్రామంలోని స‌ర్వే నంబ‌రు 668 నుంచి 674 వ‌ర‌కూ ఉన్న 28 ఎక‌రాల మేర గ్రీన్‌ఫీల్డ్ కాల‌నీ పేరిట 1991లో లే ఔట్ వేశారు. 2018లో ఇందులోని కొన్ని ప్లాట్లు ఎల్‌ ఆర్ ఎస్ కూడా అయ్యాయి. ఇదే లే ఔట్‌కు చెందిన భూమిని మ‌ళ్లీ వేరే వ్య‌క్తుల‌కు అమ్మేయ‌గా వాళ్లు పాత లే ఔట్‌ను మాయం చేస్తూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ లే ఔట్‌లో ర‌హ‌దారులు, పార్కుల‌ను కాపాడుతూ.. పాత లే ఔట్‌కు ప్రాణం పోయాల‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. మదీనాగూడ RTC కాలనీలో 402 చదరపు గజాల స్థలాన్ని లేఅవుట్‌లో వైద్య సదుపాయం, ప్రజా అవసరాల కోసం కేటాయించారు. ఈ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపిస్తూ RTC కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు HYDRAA ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని పరిరక్షించాలని వారు కోరారు. ఇలా హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు అందాయి. వీటిని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు ప‌రిశీలించి.. ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

ఫిర్యాదులు ఇలా..
❇️ మేకలమండి బస్తీలో సర్వే నంబర్ 242లోని ప్రభుత్వ భూమి/స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి ప్రహరీలతో పాటు ఇత‌ర‌ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ స్థానికులు HYDRAA ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో కాలనీకి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని వారు కోరారు.

❇️ పటేల్‌గూడలోని సృజన లక్ష్మీనగర్ ఫేజ్-2లో రోడ్ నంబర్ 7ను నాళా పక్కన ఆక్రమించి రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని స్థానికులు HYDRAA ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాలనీలోని 9, 8, 7 రోడ్లలో రోడ్ నంబర్ 7 అత్యంత సౌకర్యవంతమైన మార్గమని.. ఆక్రమణల కారణంగా ప్రజలు ఈ రహదారిని వినియోగించలేకపోతున్నారని తెలిపారు. రోడ్డును పరిశీలించి అక్రమ ఆక్రమణలను తొలగించి రోడ్ నంబర్ 7ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.

❇️ గాజులరామారం దేవేందర్‌నగర్‌లోని చింతల్ చెరువు ప్రాంతం, సర్వే నంబర్ 329లో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని వీనస్ రాక్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు HYDRAA ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గతంలో HYDRAA తొలగించిన అక్రమ నిర్మాణాలను మళ్లీ చేపడుతున్నారని.. అనధికార విద్యుత్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమితో పాటు చింతల్ చెరువు ప్రాంతాన్ని పరిరక్షించాలని భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.

❇️ వనస్థలిపురం మారుతీనగర్‌లో సర్వే నంబర్లు 158, 159, 179లోని ప్లాట్ నంబర్లు 226, 227లను కాలనీ టెంపుల్, పబ్లిక్ పార్కు కోసం కేటాయించినప్పటికీ ఆక్రమణకు గురయ్యాయని మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు HYDRAA ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ స్థలంలో అనుమతులు లేకుండా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారని.. గతంలో అడ్డుకున్న నిర్మాణ పనులను మళ్లీ కొనసాగిస్తున్నారని తెలిపారు. స్థలాన్ని పరిశీలించి అక్రమ నిర్మాణాలను తొలగించి.. పార్కుతో పాటు ఆలయ స్థలాన్ని కాలనీ ప్రజలకు తిరిగి అందించి అభివృద్ధి చేయాలని వారు కోరారు.