- ఇక్కడి స్థల వివాదాన్ని కోర్టుకు నివేదిస్తాం
- కోర్టు అనుమతితో ఇక్కడి స్థలాన్ని కాపాడుతాం
- కాలనీ స్థలాన్ని కాపాడుతామన్న హైడ్రా కమిషనర్
పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో కాలనీవాసులకు హైడ్రా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. కాలనీలలోని నివాసితులు, సంక్షేమ సంఘాల వారు ఎవరూ ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్ మండలం వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలంలో అక్రమ కట్టడం జరుగుతోందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ స్థలాన్ని కాపాడుకోడానికి కాలనీవాసులు రెండేళ్లుగా పోరాడుతున్నారు. ఇక్కడ ఆక్రమణలను అడ్డుకున్నవారిని కబ్జాదారులు బహిరంగంగా బెదిరించడమే కాకుండా.. హతమారుస్తామని హెచ్చరించిన వీడియో చూసి ఇక్కడికి వచ్చినట్టు కమిషనర్ తెలిపారు. 1987లో ఈ లే ఔట్ వేయగా.. అప్బటి సొసైటీకి బాధ్యతలు అప్పజెబుతూ ప్లాట్ నంబరు 39, 40లను ప్రజావసరాలకోసం కేటాయించడం జరిగింది. ఆ సొసైటీ 45 ఏళ్లుగా ఎలాంటి కార్యకలాపాలు చేయకుండా.. లెక్కలు చెప్పకపోవడంతో ఆ సొసైటీ పనిచేయనదిగా గుర్తించి రద్దు చేసినట్టు జిల్లా కోపరేటివ్ అధికారి హైడ్రాకు లేఖ కూడా రాశారు. వాళ్లంతా 2023లో ఈ రెండు ప్లాట్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేశారు. అక్కడి నుంచి కాలనీవాసుల పోరాటం ప్రారంభమైంది. ఈ వివాదం కోర్టులో ఉండగా.. గతంలో జి ప్లస్ 1 నిర్మాణానికి అనుమతి తీసుకుని 4 అంతస్తులు నిరాటంకంగా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. దీనిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా.. వారిని అక్కడ నిర్మాణదారులు కిరాయి మనుషులతో బెదిరించడం జరిగింది. కోర్టుకు కూడా ఈ విషయాలన్నీ నివేదించి ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడుతామని.. కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన పని లేదని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజా ఆస్తులు, పార్కులు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా రాజీపడదని ఆయన పేర్కొన్నారు. సంబంధిత రికార్డులు, భూ హక్కులు, నిర్మాణ అనుమతులను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే హైడ్రా కమిషనర్ ఇక్కడకు వచ్చి మాకు అండగా నిలబడ్డారంటూ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. మహిళలు, నివాసితులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పబ్లిక్ కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని ఎలా అమ్ముతారు..
1987లో ప్రజా అవసరాల కోసం కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి 400ల గజాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలాన్ని ప్రజావసరాలకే వినియోగించాలి కాని ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తగదని అక్కడి కాలనీవాసులు తెలిపారు. దొంగ అనుమతుల ప్రకారం గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్తుకు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఉన్నప్పటికీ, నాలుగు అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా అవసరాల కోసం ఉద్దేశించిన పార్కు భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని వారు కోరారు.