ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్‌ డీఏవో గా పనిచేస్తున్నతహసీల్దార్‌ దేసాని శ్రీనివాస్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్‌ ఆఫీస్‌లో డివిజనల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(డీఏవో)గా పనిచేస్తున్న తహసీల్దార్‌ దేసాని శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. గురువారం ఉదయం తెల్లవారుజాము నుంచే ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువులకు చెందిన మొత్తం 7 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి రూ.6.87 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు తేల్చారు. ఏసీబీ సోదాల సందర్భంగా కర్మన్‌ఘాట్‌లో రూ. 2.63 కోట్ల విలువైన రెండు నివాస ఫ్లాట్లు (ఒకటి పూర్తయినది, మరొకటి సెమీ ఫినిష్డ్‌), సరూర్‌నగర్‌ పరిధిలో రూ. 1.61 కోట్లకు పైగా విలువైన 233 చదరపు గజాల జీ+3 పెంట్‌ హౌస్‌, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలో రూ.25 లక్షల విలువైన 10 ఎకరాల 8 గుంటల వ్యవసాయ భూమిని గుర్తించారు.

వీటితోపాటు నగర శివారు, ఇతర ప్రాంతాల్లో రూ. 62.84 లక్షల విలువైన 8 ఓపెన్‌ ప్లాట్లు, బాలాపూర్‌ పరిధిలోని ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రూ.86 లక్షల భాగస్వామ్య పెట్టుబడి, రూ. 4 లక్షల నగదు, రూ. 8.6 లక్షల బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉన్నట్టు గుర్తించారు. అలాగే రూ.5.85 లక్షల విలువైన 680 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్యాంక్‌లో 46 తులాల బంగారం కుదువబెట్టి రుణం పొందిన డాక్యుమెంట్లు, 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు, రూ.11 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల అధికారిక ప్రభుత్వ నమోదు విలువ రూ.6,87,36,792గా రికార్డుల్లో నమోదు చేశారు. అయితే, వీటి విలువ బహిరంగ మారెట్‌లో చాలా ఎకువగా ఉంటుందని తెలిపారు. 2009లో మహేశ్వరం మండలంలో ఆర్‌ఐగా పనిచేస్తున్న సమయంలో కూడా శ్రీనివాస్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేయడం గమనార్హం. నిందితుడిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064 లేదా వాట్సాప్‌ నంబర్‌ 9440446106 ద్వారా సంప్రదించాలని ఏసీబీ కోరింది.