మంత్రి కొండా సురేఖకు పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందేనని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డిని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని సూచించింది. ఈ మేరకు కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై సమగ్ర నివేదికలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, కన్వీనర్ శ్యామ్ మోహన్ మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు సమర్పించారు. వారు ఇచ్చిన నివేదికల కాపీలను మహేశ్‌గౌడ్.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు పంపించారు. ఆ నివేదికలకు మీనాక్షి, మహేశ్‌గౌడ్ తమ సూచనల్నీ జోడించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు పంపనున్నారు. కాగా.. కొండా సురేఖ, ఆమె కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులు కావడం ఇదే మొదటిసారి కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి అని క్రమశిక్షణ కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సినీ నటుడు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులపై కొండా సురేఖ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లిందని తన నివేదికలో కమిటీ గుర్తు చేసింది. అలాగే గతంలో ఓ బెదిరింపు కేసుకు సంబంధించి కొండా సురేఖ ఓఎస్డీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వెళితే.. వారిని అడ్డుకోవడమే కాకుండా ఆ సందర్భంగా సురేఖ కూతురు సుస్మితా పటేల్.. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్నీ ప్రస్తావించింది. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పారని పేర్కొంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డిపై, ఆయన సోదరులపై సుస్మితా పటేల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. దానికి వివరణ ఇవ్వాల్సిందిగా కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు పంపినట్లు తెలిపింది. అయితే సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, తనకు సంబంధం లేని అంశంపై వివరణ కోరడం సరికాదంటూ సురేఖ వివరణ ఇచ్చారని పేర్కొంది. క్యాబినెట్ మంత్రి అయివుండీ.. సీఎం రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను సురేఖ కనీసం ఖండించలేదని తెలిపింది.