తెలంగాణ జీవితం తెరపై కనిపించాలి -రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, హరికృష్ణ

సినిమా రంగంలో కూడా తెలంగాణ ప్రతిభ కనిపించాలి, తెలంగాణ యాస, జీవితం తెరపై కనిపించాలి. ఆ క్రమంలోనే రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఒక వినూత్నమైన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాం. వాటిలో భాగంగా ఎవరైతే యువ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో .. న్యూ ఫిల్మ్ మేకర్స్, ఆశావాద ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్ వారందరికీ ఒక మంచి ప్లాట్ ఫామ్ ను తయారు చేయాలనే లక్ష్యంతో (రవీంద్రభారతి) ఇక్కడ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అనే దాన్ని ఏర్పాటు చేశాం.
దాన్ని అత్యంత ఆధునికమైన హంగులతో 5.1 డాల్బీ సిస్టమ్స్ తో, మంచి ప్రొజెక్టర్ తో ఒక ఆల్ట్రా మోడరన్ థియేటర్‌ను తీర్చిదిద్దాం. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరుపున కొన్ని విదేశీ చిత్రాలను సేకరించి ప్రతి ఆదివారం పైడి జయరాజ్ థియేటర్ లో ప్రదర్శిస్తున్నాం. ప్రతి ఆదివారం ఒక వరల్డ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన దర్శకుల చిత్రాలను ఇక్కడ రవీంద్రభారతిలో ప్రదర్శిస్తున్నాం.
జపనీస్, కొరియన్, ఇరాన్, జెర్మన్, మెక్సికన్, యురోపియన్, లండన్ దర్శకులు తీసిన అద్భుతమైన చిత్రాలను నేటి యువతరానికి అందుబాటులోకి తెస్తున్నాం. ఇప్పటి వరకు ఇక్కడ ఒక 105 చిత్రాలను ప్రదర్శించాం.